మధిర: కాలం ఎంత దూరం తీసుకెళ్లినా, మనసు ఎప్పుడూ ఇంటి దారి మర్చిపోదని మరోసారి రుజువైంది. చిన్నపాటి మనస్పర్దలతో 13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన మధిర మండలం ఖమ్మంపాడుకు చెందిన షేక్ అక్బర్ 25 ఏళ్ల అనంతరం 38 ఏళ్ల వయస్సు వచ్చాక మంగళవారం సొంతగూటికి చేరుకున్నాడు. అంతేకాక భార్యాపిల్లలతో రావడం ఆయన కుటుంబంలో సంతోషాన్ని నింపింది. అప్పట్లో రైలులో పుణె వెళ్లిపోయిన అక్బర్ అక్కడే జీవనం సాగించాడు. ఈ మేరకు ఫేస్‌బుక్ ద్వారా కుటుంబాన్ని గుర్తించిన ఆయనకు కుటుంబీకులు, స్వగ్రామంపై మమకారాన్ని పెంచింది. దీంతో భార్యాపిల్లలతో వచ్చిన అక్బర్‌ను కుటుంబీకులు స్వాగతించి సంతోషంలో మునిగిపోయారు. అయితే, తన కోసం ఎదురుచూస్తూ తల్లి కన్ను మూసిందని తెలియగా.. ఒక్కసారైనా తల్లిని చూపించాలని అక్బర్ కోరడం అందరినీ కంటతడి పెట్టించింది.
కుటుంబంపై ఇష్టాన్ని పెంచిన ‘ఫేస్‌బుక్’


