తొలిపోరు నేడే
145 జీపీలు, 1,097 వార్డులకు పోలింగ్ 8 మండలాల్లో 2,70,573 మంది ఓటర్లు
మండలం జీపీలు వార్డులు
అశ్వాపురం 23 193
భద్రాచలం 01 20
బూర్గంపాడు 13 125
చర్ల 26 152
దుమ్ముగూడెం 32 192
కరకగూడెం 16 118
మణుగూరు 14 123
పినపాక 20 174
చుంచుపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొదటి దశలో 8 మండలాల పరిధిలో ఏకగ్రీవాలు మినహా 145 పంచాయతీలు, 1,097 వార్డులకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎన్నికలు జరగనున్నాయి. 3,028 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2,70,573 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే 4,003 మంది అధికారులు, సిబ్బంది బుధవారమే సామగ్రితో సహా తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకున్నారు. ఇందులో 1,812 మంది పీఓలు, 2,191 మంది ఓపీఓలు ఉన్నారు. వీరితో పాటు అదనంగా మరో 10 శాతం మంది ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. ఎనిమిది మండలాల పరిధిలో 56 మంది రిటర్నింగ్ అధికారులు, 191 మంది స్టేజ్–2 అధికారులు, 79 మంది రూట్ ఆఫీసర్లు, 26 మంది జోనల్ అధికారులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఓటరు గుర్తింపు కార్డు ఉంటేనే ఎవరినైనా పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియనుండగా, 2 గంటలకు లెక్కింపు ప్రారంభించి అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. మొదట వార్డుల వారీగా ఓట్లను లెక్కించి, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
14 జీపీలు ఏకగ్రీవం..
తొలివిడతలో అశ్వాపురం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల పరిధిలోని 159 పంచాయతీలు, 1,436 వార్డులకు గాను 14 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 145 పంచాయతీల్లో నేడు పోలింగ్ కొనసాగనుండగా, 461 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,436 వార్డులకు మూడు చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 336 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1,097 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 2,567 మంది పోటీ పడుతున్నారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 2,70,573 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో మహిళలు 1,21,037, పురుషులు 1,49,525 మంది కాగా ఇతరులు 11 మంది ఉన్నారు. తొలి విడతలో 1,428 పోలింగ్ కేంద్రాలకు గాను 1,510 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచారు. ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపునకు దాదాపు 70 బస్సులు, 15 మినీ బస్సులతో పాటు ఇతర టాటా మ్యాజిక్ వాహనాలను వినియోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లాలో తొలివిడత 145 గ్రామపంచాయతీలు, 1,097 వార్డులకు గురువారం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది బుధవారమే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సామగ్రితో సహా తరలివెళ్లారు. పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. – జితేష్ వి.పాటిల్, కలెక్టర్
మొదటి విడత ఎన్నికలకు రంగం సిద్ధం
తొలిపోరు నేడే
తొలిపోరు నేడే
తొలిపోరు నేడే


