భవితవ్యం మీ చేతుల్లోనే..
● ప్రలోభాలకు కాదు.. ప్రగతికి ఓటేద్దాం ● నేడు గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్
కరకగూడెం: ప్రజాస్వామ్య పండుగగా నిలిచే గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం జరుగనుంది. ఇది కేవలం ఓటు హక్కు వినియోగం మాత్రమే కాదు.. గ్రామ భవిష్యత్‌ను చక్కదిద్దే అవకాశం. ఈ ఓటుపైనే గ్రామాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతీ పౌరుడు ఆలోచించాల్సిన కొన్ని కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి.
గ్రామాల్లో కులం, బంధుత్వం, పార్టీ అభిమానం ఆధారంగా ఓటేస్తుంటాం. అలా కాకుండా మనం వేసే ఓటు.. రోడ్లు వేయించడం, తాగునీటి సమస్య పరిష్కరించడం, వీధి దీపాలు వెలిగించడం వంటి మౌలిక వసతులు తీర్చేదిగా ఉండాలి. గ్రామాభివృద్ధికి కట్టుబడే నాయకుడిని ఎన్నుకుంటేనే ఇవన్నీ నెరవేరుతాయి. లేదంటే రాబోయే ఐదేళ్లు గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతుంది.
నాయకుడిని ఎన్నుకునేటప్పుడు అతడికి ఎంత డబ్బు ఉందని చూడకుండా విద్య, పని చేయగల సామర్థ్యం, సమస్యలు అర్థం చేసుకునే గుణం, ప్రభుత్వ పథకాలు, నిబంధనలపై అవగాహన ఉన్న వారిని గుర్తించాలి. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వారికే ఓటు వేయాలి.
ఒకరోజు సంతోషం కోసం ఓటు అమ్ముకోవడం ప్రమాదకరం. వారిచ్చే డబ్బు, మద్యం తీసుకుని ఓటేస్తే గెలిచిన అభ్యర్థి ఐదేళ్ల పాటు ప్రజాప్రయోజనాలు కాకుండా.. అధికారాన్ని తన సొంతానిని వినియోగించుకుంటాడు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కావడంతో పాటు గ్రామ భవిష్యత్తే దెబ్బతింటుంది.
గ్రామాల్లో మహిళా ఓటర్లు, యువకులు ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలి. పోటీ చేసే అభ్యర్థి గ్రామానికి ఏం చేస్తారో ప్రశ్నించాలి. అలాగే తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై మహిళల నిర్ణయాధికారం పెరుగుతోంది. అందుకే ప్రలోభాలకు లొంగకుండా తమ కుటుంబ సంక్షేమం కోసం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి.
ఎన్నికల తర్వాత కూడా గ్రామాభివృద్ధి నిరంతరం సాగాలంటే ఎన్నికల సమయంలో శాంతి, సామరస్యాలు పాటించాలి. గొడవలు గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. రాజకీయాలకతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే గ్రామంలో ఏ పని అయినా సాధ్యమవుతుంది.


