
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్
చర్ల: ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ సూచించారు. ఆదివారం ఆయన డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జయలక్ష్మితో కలిసి మండలంలోని ఉంజుపల్లి పల్లె దవాఖానాను సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సికిల్ సెల్ ఎనీమియా, టీబీ ముక్త్ భారత్, ఎన్‌సీడీ స్క్రీనింగ్, జ్వర పీడితుల గుర్తింపు తదితర వైద్య సేవలపై అధికారులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధువరన్, చర్ల ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ స్పందన, డాక్టర్ పుల్లారెడ్డి, డాక్టర్ తేజశ్రీ, ఉంజుపల్లి సబ్‌సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.