
ఎక్కడికక్కడే సేకరణ.. అమ్మకం
ఖమ్మంవ్యవసాయం: పాల ప్రాధాన్యత పెరిగిన నేపథ్యాన సేకరణ, విక్రయాలు మరింత పెంచాలని రాష్ట్ర పాడి పరిశ్రమ(విజయ డెయిరీ) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని యూనిట్ల వారీగా సేకరించిన పాలను ఆయా యూనిట్ల పరిధిలోనే ఏ రోజుకు ఆ రోజు విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయాన పాల ఉత్పత్తుల వ్యాపారంపైనా దృష్టి సారించాలని ఆ ఆదేశాల్లో అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం యూనిట్లలో సేకరించే పాలలో తక్కువ శాతం స్థానికంగా విక్రయిస్తూ మిగిలిన పాలను రాష్ట్ర పాడి పరిశ్రమకు చేరవేస్తున్నారు. అక్కడ పాలను పొడిగానే కాక ఇతర ఉత్పత్తులుగా మార్చి రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఈక్రమంలో ఖర్చు పెరుగుతుండడమే కాక వ్యాపారం మందగించినప్పుడు పాల ఉత్పత్తులు పేరుకుపోతున్నాయి. ఈ అంశంపై సమీక్షించిన అధికారులు ప్రైవేట్ సంస్థల మాదిరిగానే ఎక్కడ సేకరించిన పాలను అక్కడే విక్రయించాలనే నిర్ణయానికి వచ్చారు. ‘విజయ’ డెయిరీ పాలకు ఆదరణ ఉన్నప్పటికీ అందుబాటులో లేక వ్యాపారం తగ్గుతుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
6వేల లీటర్ల సేకరణ
ఖమ్మంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమ(విజయ డెయిరీ) యూనిట్ ద్వారా ఉమ్మడి జిల్లాలోని 30మండలాల్లో 227 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటి ద్వారా 3,025 మంది పాడి రైతుల నుంచి నిత్యం 6వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. కామేపల్లి, మధిర, ఎర్రుపాలెం, కల్లూరు, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెంలోని పాల శీతలీకరణ కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతోంది. ఖమ్మంలోని రోటరీనగర్‌లో 25వేల లీటర్ల సామర్ధ్యంతో యూనిట్ ఉన్నా అందుకు అనుగుణంగా పాల సేకరణ జరగడం లేదు. సీజన్‌లో 15వేల లీటర్ల పైగా, మిగతా సమయాల్లో ఆరు వేల లీటర్లు దాటడం లేదు.
స్థానికంగా వ్యాపారంపై ప్రణాళిక
ఉమ్మడి జిల్లాలో సేకరించే పాలను స్థానికంగానే విక్రయించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం 6వేల లీటర్ల మేర పాలు సేకరిస్తుండగా రెండు వేల లీటర్లే ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇందులో 1,500 లీటర్లు ప్రైవేట్ మార్కెట్ ద్వారా, 500 లీటర్ల పాలను ప్రభుత్వ హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. మిగిలిన పాలను హైదరాబాద్ రాష్ట్ర పాడి పరిశ్రమకు పంపిస్తున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు ఉన్నందున అన్నింటికీ విజయ పాలు సరఫరా చేసేలా నిర్ణయించి, భద్రాచలం ఐటీడీఏ పీఓను డెయిరీ పాడి పరిశ్రమ అధికారులు కలిశారు. అన్నీ కలిసొస్తే త్వరలోనే ఇక్కడే విజయ డెయిరీ పాల విక్రయం పెరగనుంది.
మరిన్ని పార్లర్లు, ఏజెంట్లకు ప్రోత్సాహం
విజయ పాలకు ఉన్న డిమాండ్ ఆధారంగా ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో పార్లర్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మంతో పాటు జిల్లాలో కేవలం ఐదు పార్లర్లే కొనసాగుతున్నాయి. విజయ పాలు, పాల ఉత్పత్తులకు డిమాండ్ ఉన్నప్పటికీ లభ్యత లేక ప్రజలు ప్రైవేట్ డెయిరీలపై ఆధారపడుతున్నారు. ఈనేపథ్యాన పార్లర్లు కనీసం మరో 15 ఏర్పాటుచేయడం ద్వారా విక్రయాలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. ఖమ్మంతో పాటు మధిర, వైరా, సత్తుపల్లి, ఖమ్మం రూరల్, ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, అశ్వాపురం, భద్రాచలం, కోదాడ, సూర్యాపేటల్లో కూడా పార్లర్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఇదే సమాయన ఏజెంట్లను ప్రోత్సహించాలనే భావనకు వచ్చారు. సంస్థ లీటర్ పాలపై డిస్ట్రిబ్యూటర్లకు రూ.5 చొప్పున కమీషన్ ఇస్తుంది. అక్కడి నుంచి ఏజెంట్లకు సరఫరా చేస్తారు. ఈనేపథ్యాన ఏజెంట్లను మరింతగా పెంచడం ద్వారా వ్యాపారం పెంపొందించేలా కసరత్తు మొదలుపెట్టారు.
విజయ డెయిరీ అధికారుల కార్యాచరణ
పట్టణాల్లో ఇంకొన్ని పార్లర్ల ఏర్పాటుకు చర్యలు
ఏజెంట్లను మరింతగా
ప్రోత్సహించాలని నిర్ణయం
పాల సేకరణ పెంపునకు కృషి
ఉమ్మడి జిల్లాలో పాల విక్రయానికి వనరులు ఉన్నాయి. ప్రస్తుతం సేకరిస్తున్న పాలలో మూడో వంతే ఇక్కడ విక్రయిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో మొత్తం పాలను స్థానికంగా విక్రయానికి ప్రణాళిక రూపొందించారు. ఇదే సమయాన పాల సేకరణను 20 వేల లీటర్లకు పెంచేలా కృషి చేస్తున్నాం. – కె.రవికుమార్,
విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్, ఖమ్మం

ఎక్కడికక్కడే సేకరణ.. అమ్మకం

ఎక్కడికక్కడే సేకరణ.. అమ్మకం

ఎక్కడికక్కడే సేకరణ.. అమ్మకం