
కలిసుంటే.. కలదు సుఖం!
ఆర్థిక పరిస్థితుల వల్లే..
ఉమ్మడి కుటుంబం ఐక్యతకు ప్రతీక.. కష్టసుఖాలను పంచుకునే వేదిక. బంధం, అనుబంధం, ప్రేమానురాగాలతో బృందావనాన్ని తలపిస్తుంది. తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, బాబాయిలు, చిన్నమ్మలు, మేనత్తలు, మామలు, అన్నయ్యలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు, వదినలు, మరదళ్లు, బావలు, బావమరుదులతో ఆనందంగా జీవిస్తుంటారు. పూర్వం నుంచి దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పటికీ కాలక్రమంలో మార్పులు వచ్చాయి. స్వేచ్ఛ లేదని, ప్రైవసీ కొరవడుతుందనే భావనతో వేరుగా జీవిస్తుండటంతో దాదాపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోయే దశకు చేరగా.. ఇంకా ఒకటో, రెండో కుటుంబాలు అక్కడక్కడా ఉమ్మడిగా జీవనం సాగిస్తున్నాయి. ఆ కుటుంబాల గురించి తెలుసుకుందాం. –ఖమ్మంగాంధీచౌక్
ఒంటరితనం దూరం.. ప్రయోజనాలనేకం
ఉమ్మడి కుటుంబతో ఒంటరితనం దూరమవుతుంది. కుటుంబ వాతావరణం పిల్లల్లో సానుకూల ప్రభావం చూపుతుందని, వ్యవహారిక జ్ఞానం పెంచుతుందని, మానసిక పరిపక్వతకు దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ప్రతి జంట ‘మేమిద్దరం.. మాకొక్కరు’అనే విధానాన్ని అనుసరిస్తున్నారు. దీంతో తోబుట్టువులు లేకపోవడంతో చిన్నారులు ఎక్కువ శాతం మంది ఒంటరితనానికి లోనవుతున్నారనే నిపుణుల పరిశీలనలో తేలింది. ఆడుకునేందుకు తమ ఈడు పిల్లలు లేకపోవడం, ఒక్క సంతానమని తల్లిదండ్రులు గారాబంగా, బయటకు వెళ్లనీయకుండా పెంచడంతో ఒంటరితనానికి లోనవుతున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఈ సమస్య రాదని నిపుణులు చెబుతున్నారు. చిన్నాన్న, పెదనాన్న పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒంటరిగా చదువుకోలేని పిల్లలు ఉమ్మడిగా చదువులో కూడా రాణిస్తారు. నాయనమ్మ, తాతయ్యలతో ఉంటే నీతికథలు వింటూ అనుభవాలను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆనందంగా గడిపే పిల్లలు శారీరకంగా, మానసికంగా పటిష్టంగా ఉంటారు. పెద్దల సలహాలు లభిస్తాయి. బాధలో ఉన్నప్పడు ఓదార్పు, అభయం లభిస్తుంది. మహిళలకు గౌరవం, హుందాతనం లభిస్తుంది.
● మా కుటుంబంలో
40 మంది..
బూర్గంపాడు: కరకగూడెం గ్రామానికి చెందిన సయ్యద్ ఖాజాహుస్సేన్, రహిమున్నీషా బేగం దంపతులకు తొమ్మిదిమంది సంతానం. వీరిలో ఏడుగురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. కుటుంబ పెద్ద సయ్యద్ ఖాజాహుస్సేన్ పదిహేను ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ అందరినీ చదివించి పెద్దచేశాడు. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించి ప్రయోజకులుగా మార్చాడు. కుమారులు, కుమార్తెలు, కోడళ్లు, అల్లుళ్లు, మవవళ్లు, మనవరాళ్లతో కుటుంబ సభ్యులు 40కి చేరారు. కుమారులు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరపడ్డారు. మనవళ్లు, మనవరాళ్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మనవళ్లు, మనవరాళ్లు, ముని మనవళ్లు, ముని మనవరాళ్లతో సంతోషంగా కాలం గడుపుతున్నానని, కుటుంబం తనను ఎంతో అప్యాయతతో చూసుకుంటోందని ఖాజాహుస్సేన్ తెలిపాడు. కాగా అతని భార్య రహిమున్నీషా పదేళ్ల క్రితం మృతి చెందింది.
● అంతా కలిస్తే పండుగే..
ఇల్లెందు: ఇల్లెందు మండలం మాణిక్యారం పంచాయతీ ఎల్లాపురానికి చెందిన మోకాళ్ల కన్నయ్య–చుక్కమ్మలకు ఎనిమిది మంది సంతానం. ఆరుగురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. వారి పిల్లలతో మొత్తం కుటుంబంలో 33 మంది ఉన్నారు. శుభకార్యాలు జరిగితే సందడి నెలకొంటుంది. ఏడాదికి ఒకసారైనా అంతా ఒక చోట కలిసి పండుగ చేసుకుంటుంటారు. కన్నయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత పెద్ద కుమారుడు, మాజీ సర్పంచ్ మోకాళ్ల కృష్ణ కుటుంబ బాధ్యతలు స్వీకరించారు. మూడో తరంలో 16 మంది సంతానం. నేటి వరకు తోబుట్టువుల మధ్య పొరపొచ్చాలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని, ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అందరూ ఒక చోట చేరి చర్చించుకుని ముందుకు సాగుతామని కృష్ణ తెలిపాడు. దీంతో గ్రామంలో గౌరవం కూడా ఉందని పేర్కొన్నాడు.
నేడు ప్రపంచ
జనాభా దినోత్సవం
ఉమ్మడి కుటుంబాలతోనే జీవన మాధుర్యం
కష్టసుఖాల్లో ఒకరికి అందరూ.. అందరికీ ఒకరు
ప్రేమానురాగాలు, వ్యవహారిక జ్ఞానం ద్విగుణీకృతం

కలిసుంటే.. కలదు సుఖం!

కలిసుంటే.. కలదు సుఖం!