
అరకొర వసతులతోనే..
● జిల్లా పరిషత్‌కు ఏళ్లుగా పక్కా భవనం లేదు ● కొత్త మండలాలదీ అదే పరిస్థితి.. ● కనీస సౌకర్యాలు లేక సిబ్బంది ఇక్కట్లు
చుంచుపల్లి : జిల్లా ప్రజా పరిషత్‌తో పాటు, పలు కొత్త మండల కార్యాలయాలకు సొంత భవనాలు లేక అరకొర వసతుల నడుమే పాలన సాగుతోంది. 2016 అక్టోబర్ 11న ఖమ్మం నుంచి విడిపోయి భద్రాద్రి జిల్లా కొత్తగా ఏర్పడింది. ఆ సమయంలోనే కొత్తగా మరో ఆరు మండలాలలకూ అవకాశం దక్కింది. దీంతో మొత్తం 21 మండలాలతో కలిసి జిల్లా పరిషత్ వ్యవస్థ రూపొందింది. 2019 జూలైలో తొలిసారి జిల్లా, మండల ప్రజా పరిషత్‌లకు ఎన్నికలు జరగగా ఆరేళ్లుగా జెడ్పీ కార్యాలయానికి సొంత భవనం లేదు. గతంలో ఉన్న కొత్తగూడెం మండల పరిషత్ భవనం నుంచే జెడ్పీ పాలన సాగిస్తున్నారు. ఇక్కడ సరైన గదులు, సమావేశ మందిరం అందుబాటులో లేక అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇటీవల జెడ్పీ కార్యాలయానికి పక్కా భవనం కోసం స్థలం గుర్తించి పక్కా భవన నిర్మాణానికి రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు మంజూరుచేయలేదు. కొత్త పాలక వర్గాలు వచ్చేలోపైనా జెడ్పీ కార్యాలయానికి పక్కా భవనం అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.
కొత్త మండలాలదీ ఆదే పరిస్థితి..
కొత్త జిల్లా ఏర్పాటు సమయంలోనే చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, కరకగూడెం మండలాలు సైతం ఏర్పాటయ్యాయి. ఈ మండల పరిషత్ కార్యాలయాలకూ పక్కా భవనాలు లేవు. గుండాల మండలం నుంచి 10 గ్రామ పంచాయతీలతో ఆళ్లపల్లి మండలాన్ని ఏర్పాటు చేశారు. మండల ఆవిర్భావ సమయంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయగా, అప్పటి నుంచి ఇరుకు గదులు, అరకొర సౌకర్యాల మధ్యే పాలన సాగుతోంది. చండ్రుగొండ మండలంలోని 10 గ్రామ పంచాయతీలను కలిపి అన్నపురెడ్డిపల్లి మండలాన్ని ఏర్పాటు చేయగా.. సాంఘిక సంక్షేమ భవనంలో అరకొర వసతుల నడుమ పాలన కొనసాగుతోంది. పినపాక నుంచి విడిపోయిన కరకగూడెం మండల పరిషత్‌ను గిరిజన సొసైటీ భవనంలో ఏర్పాటు చేయగా.. నేటికీ అక్కడి నుంచే అధికారులు పని చేస్తున్నారు. చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని పాత ఆర్‌డబ్ల్యూఎస్ ఆఫీస్‌లో కొనసాగిస్తుండగా సిబ్బందికి సరైన గదులు, వసతులు లేక ఇబ్బంది తప్పడం లేదు. లక్ష్మీదేవిపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాల భవనంలో ఏర్పాటు చేయగా, ఇక్కడ కనీసం సమావేశాలకు హాలు కూడా లేకపోవడం గమనార్హం. సుజాతనగర్ మండల పరిషత్‌ను పాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో ఏర్పాటు చేయగా, అక్కడా అరకొర సదుపాయాల నడుమే పాలన సాగుతోంది.
మరోసారి ప్రతిపాదనలు పంపుతాం
జెడ్పీ కార్యాలయానికి పక్కా భవనం కోసం పాత జిల్లా పరిషత్ పరిధిలోని స్థలాన్ని కేటాయించాం. నిర్మాణ పనులకు రూ.10 కోట్లతో గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇంకా నిధులు మంజూరు కాలేదు. మరోసారి ప్రతిపాదనలు పంపాలనుకుంటున్నాం. కొత్త మండలాల పరిధిలో పక్కా భవనాలకు స్థలాలను ఆయా మండలాల అధికారులు చూస్తున్నారు. – డి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ

అరకొర వసతులతోనే..

అరకొర వసతులతోనే..