మున్సిపాలిటీ ఇక కనుమరుగు! | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీ ఇక కనుమరుగు!

May 30 2025 12:15 AM | Updated on May 30 2025 12:15 AM

మున్స

మున్సిపాలిటీ ఇక కనుమరుగు!

పాల్వంచ: పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ మున్సిపాలిటీ ఇక కనుమరుగై కొత్తగూడెం కార్పొరేషన్‌లో విలీనం అయింది. దీంతో డివిజన్‌ ఆఫీస్‌గా మాత్రమే మనుగడ కొనసాగనుంది. ఇకపై పరిపాలనా వ్యవహారాలన్నీ కొత్తగూడెం కార్పొరేషన్‌లోనే నడవనున్నాయి. కార్పొరేషన్‌ అయితే గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నా.. పన్నుల భారం కూడా అధికంగానే ఉంటుందని స్థానికులు అంటున్నారు. 1987లో ఏర్పడిన పాల్వంచ మున్సిపాలిటీ 38 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు పలికింది. కొత్తగూడెం కార్పొరేషన్‌ జీఓ గురువారం విడుదలైంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్‌, కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లోని పలు గ్రామాలు సైతం ఈ కార్పొరేషన్‌లో విలీనం కానున్నాయి.

అధికారుల పాలనలోనే..

ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా, పారిశ్రామిక పట్టణంగా ఉన్న పాల్వంచలో 24 వార్డులు, 44 స్లమ్‌ ఏరియాలు ఉండగా సుమారు లక్ష మంది జనాభా ఉన్నారు. 1987 ఫిబ్రవరిలో పాల్వంచ గ్రామ పంచాయతీని తృతీయ శ్రేణి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేసి అదే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించారు. 1992 వరకు పాలకవర్గం కొనసాగింది. తర్వాత మూడేళ్ల పాటు ఎన్నికలు జరగలేదు. తిరిగి 1995లో ఎన్నికై న పాలకవర్గం 2000 సంవత్సరం వరకు కొనసాగింది. ఇక ఆ తర్వాత ఎన్నికల ఊసే లేదు. ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయినా ఇది ఏజెన్సీనా, నాన్‌ ఏజెన్సీనా అనే వాదనలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూ ఆ ప్రభావం ఎన్నికలపై పడుతూ వచ్చింది. దీంతో గత 25 ఏళ్లుగా అధికారుల పాలనే కొనసాగుతోంది.

కొత్తగూడెం కార్పొరేషన్‌లో

పాల్వంచ విలీనం

కార్పొరేషన్‌ కమిషనర్‌గా సుజాత

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా సుజాతను నియమిస్తూ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వారు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేషన్‌లో విలీనమైన సుజాతనగర్‌ మండలంలోని ఏడు గ్రామాలు, పాల్వంచ మున్సిపల్‌ ఆస్తులను కార్పొరేషన్‌కు బదలాయించాలని, అందుకు పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.

తరలిపోయిన అనేక కార్యాలయాలు..

గతంలో ఐటీడీఏ పాల్వంచలో ఉండేది. ఆ తర్వాత భద్రాచలానికి వెళ్లింది. దాంతో పాటు ట్రైబల్‌ కోర్టు కూడా తరలిపోయింది. ఇక ఆర్డీఓ కార్యాలయాన్ని కొత్తగూడెం డివిజన్‌కు మార్చేశారు. పలు ప్రభుత్వ డివిజన్‌ కార్యాలయాలు సైతం ఇక్కడి నుంచి తరలిపోయాయి. డివిజన్‌ కేంద్రంగా ఉన్న సమయంలో ఇక్కడికి అనేక మండలాల ప్రజలు పనుల నిమిత్తం వచ్చేవారు. వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయం, ఇరిగేషన్‌ ఈఈ కార్యాలయం, ఏటీడబ్ల్యూఓ కార్యాలయాలు సైతం తరలిపోయాయి. పారిశ్రామిక కేంద్రానికి ఆయువుపట్టుగా ఉన్న కేటీపీఎస్‌లో ఓఅండ్‌ఎం(పాత ప్లాంట్‌) తొలగింపుతో వేలాది మంది కార్మికులు బదిలీపై వెళ్లిపోయారు. ఎన్‌ఎండీసీ విస్తరణకు నోచుకోక మూతబడింది. నవ కంపెనీ విద్యుత్‌ కేంద్రంలోనూ ఉత్పత్తి నిలిపివేశారు.

మున్సిపాలిటీ ఇక కనుమరుగు!1
1/1

మున్సిపాలిటీ ఇక కనుమరుగు!

Advertisement
 
Advertisement
Advertisement