
వైద్యం వికటించి మహిళ మృతి
సత్తుపల్లి: శస్త్రచికిత్స జరిగిన గంటల్లోనే మహిళ మృతి చెందగా.. ఆస్పత్రి ఎదుట ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలను మృతురాలి భర్త పి.మారేశ్వరరావు వెల్లడించారు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కోటపాడుకు చెందిన పి.జ్యోత్స్న(24) కడుపు నొప్పితో బాధపడుతుండగా బుధవారం రాత్రి సత్తుపల్లిలోని ఆల్ఫా స్కానింగ్ సెంటర్‌కు తీసుకొచ్చారు. అక్కడ పరీక్షించిన రేడియాలజిస్ట్ పరిస్థితి విషమంగా ఉందని, ఎదురుగా ఉన్న ఆస్పత్రికి వెళ్లాలని సూచించగా.. ఎస్వీసీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షల అనంతరం పిండం గర్భసంచికి బదులు పేగులోకి వెళ్లిందని, అది పగిలి రక్తస్రావమైందని డాక్టర్ సరికొండ హర్షిత్ తెలిపారు. ఆపరేషన్ చేసేందుకు కుటుంబీకులు అంగీకరించగా మరో వైద్యుడితో కలిసి శస్త్రచికిత్స చేసిన హర్షిత్ పరిస్థితి మెరుగుపడిందని చెప్పాడు. కానీ గురువారం ఉదయం జ్యోత్స్న పరిస్థితి ఆందోళన కరంగా ఉందని కుటుంబీకులు ప్రశ్నించగా మత్తు ప్రభావం కావొచ్చని బదులిచ్చాడు. ఆ కాసేపటికి వైద్యుడు ఆమెను పరీక్షించి హార్ట్ ఫెయిల్ అయి చనిపోయిందని చెప్పడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
మృతదేహం చూపించకుండా..
ఉదయం 10 గంటలకు జ్యోత్స్య మృతి చెందగా, ఆమె కుటుంబీకులకు రాత్రి ఏడు గంటల వరకు మృతదేహాన్ని చూపించలేదు. అంతసేపు ఆస్పత్రి ఎదుట రోదిస్తూ ఆందోళనకు చేపట్టారు. ఆస్పత్రిలో వెంటిలేటర్, ఐసీయూ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కాగా, జ్యోత్స్యకు రెండేళ్ల కుమార్తె ఉండగా, ఆమె మరిది పెళ్లి కోటపాడులో బుధవారం రాత్రి జరుగుతుండగానే ఆరోగ్యం విషమించడంతో సత్తుపల్లి తీసుకొచ్చారు. ఇక్కడ ఆమె మృతి చెందగా కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె బంధువులతో డాక్టర్ల బృందం చర్చలు జరిపినట్లు తెలిసింది. చివరకు రాత్రి పరస్పరం అంగీకారం కుదిరినట్లు తెలుస్తుండగా, జ్యోత్స్న మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లారు. ఈమేరకు ఎస్సైలు రఘు, కవిత ఆధ్వర్యాన బందోబస్తు నిర్వహించారు.
సత్తుపల్లిలో ఆస్పత్రి ఎదుట ఆందోళన