
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు రెండు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈసారి సుమారు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా ఈ ఏడాది శ్రీరామనవమి మరుసటి రోజు స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. దీంతో భక్తులు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇంత భారీ స్థాయిలో భక్తులు వచ్చే పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంపై రైల్వేశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
ఇప్పటికే సీట్లన్నీ ఫుల్..
భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ వేడుక తిలకించేందుకు ఏపీలోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే హైదరాబాద్ నుంచి కూడా భారీ స్థాయిలో భక్తులు హాజరవుతారు. భద్రాచలం చేరుకునేందుకు దగ్గరగా భద్రాచలంరోడ్డు (కొత్తగూడెం) రైల్వేస్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి నిత్యం హైదరాబాద్, విజయవాడ, సిర్పూర్ కాగజ్‌నగర్‌కు రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నిత్యం రెండు రైళ్లు భద్రాచలంరోడ్డు స్టేషన్‌కు నడుస్తున్నాయి. ఈ రెండు రైళ్లలో ఈనెల 28, 28, 29 తేదీలకు సంబంధించి స్లీపర్ క్లాస్ మొదలు, ఏసీ త్రీటైర్, టూ టైర్‌లో టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. కనీసం వెయింటింగ్ లిస్ట్ కూడా చూపించడం లేదు. ఇక విజయవాడ, బల్లార్షా నుంచి రెండు ప్యాసింజర్ రైళ్లు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే, ఈ రైళ్ల రాకపోకల సమయాలు కల్యాణానికి వచ్చే భక్తులకు అనుగుణంగా లేవు.
ప్రత్యేక రైళ్లు నడిపించాలి..
శ్రీరామనవమి రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, రామగుండం వంటి నగరాల నుంచి భద్రాచలం రోడ్డు(కొత్తగూడెం) స్టేషన్‌కు ప్రత్యేక రైళ్లు నడిపించాలని భక్తులు కోరుతున్నారు. ఈనెల 29, 30, 31 తేదీల్లో ఈ రైళ్లు నడిపిస్తే భక్తులకు ఉపయుక్తంగా ఉండడంతో పాటు రైల్వే శాఖకూ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనపు బోగీలు జత చేయాలని కోరుతున్నారు.
ప్రైవేట్‌లో దోపిడీ..
రాజమండ్రి, ఏలూరు వంటి గోదావరి జిల్లాల నుంచి రైలు మార్గంలో వచ్చేందుకు భక్తులకు అవకాశమే లేదు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ సంస్థలు భద్రాచలానికి వందల సంఖ్యలో సర్వీసులు నడిపిస్తున్నా.. ఆ బస్సుల్లో ఈ నెల 29, 30 తేదీలకు సంబంఽధించి సీట్లన్నీ ఇప్పటికే రిజర్వ్ అయ్యాయి. దీంతో ప్రైవేట్ బస్సులే దిక్కుగా మారాయి. అయితే శ్రీరామనవమికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల వారు ఇష్టారీతిగా టికెట్ ధరలు నిర్ణయిస్తున్నారు. సాధారణ రోజుల్లో ప్రైవేట్ ఆపరేటర్లు భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు రూ.700 వరకు తీసుకుంటుండగా ఇప్పుడు రూ.1200 వరకు చార్జ్ చేస్తున్నారు. ఏపీలోని పలు పట్టణాలకు సైతం ఇదే తీరున టికెట్ ధరలు పెంచేశారు. కుటుంబ సమేతంగా కల్యాణానికి వచ్చే భక్తులకు పెరిగిన ధరలను భారంగా మారాయి.