
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం భద్రాచలం వెళ్లనున్నారు. సాయంత్రం 7.30 గంటలకు బూర్గంపాడు మండలం సారపాక చేరుకోనున్న ఆయన ఐటీసీ అతిథిగృహంలో బస చేసి, గురువారం భద్రాచలంలో శ్రీసీతారామ స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. ఆతర్వాత మధ్యాహ్నం ఖమ్మం చేరుకుని, ఖమ్మం పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి వారి శోభాయాత్ర, తెప్పోత్సవంలో మంత్రి పాల్గొననున్నారు.
రూ.11.81 లక్షలకు సంత వేలం
టేకులపల్లి: టేకులపల్లి, గోలియాతండా గ్రామ పంచాయతీల సంయుక్త శ్రీకోదండ రామాలయం సంత వేలం రూ.11,81,000కు ఖరారైంది. గోలియాతండా పంచాయతీ కార్యాలయంలో మంగళవారం వేలం నిర్వహించగా ఏడుగురు సభ్యులు ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొన్నారు. పోటా పోటీగా సాగిన వేలంలో గోలియాతండాకు చెందిన ధారావత్ బాలాజీ నాయక్ సంతను కై వసం చేసుకున్నాడు. గతేడాది పాట కంటే రూ.1000 మాత్రమే పెరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గణేష్ గాంధీ, ఎస్‌ఐ జి.రమణారెడ్డి, సర్పంచ్‌లు బోడ నిరోషా, బోడ సరిత, కార్యదర్శులు ఎల్.కిరణ్, ప్రశాంత్, ఉప సర్పంచ్ కె.సురేష్, వార్డు సభ్యులు నోముల భానుచందర్, అనంతుల వెంకన్న, ఎండి.హాజీ, ఎండి. మౌలానా పాల్గొన్నారు.
పోషకాహారం తీసుకోవాలి
పోషణ్ అభియాన్ రాష్ట్ర అధికారి రాహుల్
టేకులపల్లి: గర్భిణులు, కిషోర బాలికలు పోషకాహారం తీసుకోవాలని పోషణ్ అభియాన్ రాష్ట్ర అధికారి రాహుల్ సూచించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్వహించిన పోషణ్ పక్వాడ వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. చిరు ధాన్యాలు, ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు , తాగునీరు తగినంతగా తీసుకోవాలని చెప్పారు. తొలుత ఆస్పత్రిలో కిషోర బాలికలకు రక్త పరీక్షలు చేయించారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు.జి ల్లా సంక్షేమ అధికారి లెనినా టేకులపల్లి, పాల్వంచ సీడీపీవోలు కె.ఎం.తార, కనకదుర్గ, సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్, వైస్ ఎంపీపీ ప్రసాద్, ఎంపీటీసీ రామకృష్ణ, సర్పంచ్‌లు బుజ్జి, సురేందర్, రాష్ట్ర టీం సభ్యులు కల్పన, రవి, వైద్యాధికారి దినేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సుభాష్‌నగర్ పాఠశాలలో తనిఖీ
ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్‌నగర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మంగళవా రం స్టేట్ అకాడమిక్ టీం తనిఖీ చేసింది. బృందం సభ్యులు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థు ల ప్రగతిని పరిశీలించారు. విద్యార్థులతో చతుర్విద ప్రక్రియలపై సాధన చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమైన పరీక్షల సమయంలోనూ విద్యార్థులపై పర్యవేక్షణ కొనసాగించాలని చెప్పారు. కార్యక్రమంలో స్టేట్‌టీం ప్రతినిధులు వెంకటరెడ్డి, బాలమురళి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
బూర్గంపాడు: మోతె గ్రామసమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పోలీసుల కథనం ప్రకారం.. పినపాక మండలం జానంపేట గ్రామంలోని సుందరయ్యనగర్‌కు చెందిన లేకం లక్ష్మి(29) తన బంధువులైన కొర్సం లక్ష్మయ్య, మడివి రమేష్‌లతో మోటార్‌సైకిల్‌పై సోమవారం భద్రాచలం వెళ్లి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో మోతె సమీపంలో కోతి అడ్డురావటంతో లక్ష్మయ్య, లక్ష్మి వస్తున్న బైక్‌కు అదుపుతప్పి కిందపడింది. దీంతో లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. భద్రాచలం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మాట్లాడుతున్న రాష్ట్ర అధికారి రాహుల్