
ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు (ఫైల్ )
వచ్చే నెల నుంచి అమల్లోకి...
ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలకు వేతనం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగిన వేతనం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. జాబ్‌కార్డులు కలిగిన కూలీలు ఎండాకాలంలో పనులను సద్వినియోగం చేసుకోవాలి.
– ఎం.విద్యాచందన, డీఆర్‌డీఓ, ఖమ్మం
ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఈ వేసవి నుంచి వేతనం పెరగనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెరిగిన వేతనాలను కూలీలకు అందజేయనున్నారు. ఇప్పటి వరకు ఒక్కో కూలీకి రూ.257 చెల్లిస్తుండగా.. ఇక నుంచి రూ.272 అందుతుంది. ఈ నిర్ణయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5.55 లక్షల మంది కూలీలకు లబ్ధి చేకూరనుంది. అయితే ఏటా కూలీలకు అందించే వేసవిభత్యంపై మాత్రం ప్రకటన చేయకపోవడం గమనార్హం.
లక్ష్యాలను నిర్దేశిస్తున్న కేంద్రం
ఉపాధి హామీ పథకం నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటికే సాప్ట్‌వేర్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న కేంద్రం పని దినాల లక్ష్యాల కేటాయింపులను కూడా పర్యవేక్షిస్తోంది. కూలీల సంఖ్య ఆధారంగా గ్రామం, బ్లాక్(మండలం), జిల్లాకు పనిదినాల లక్ష్యాలను నిర్దేశిస్తుంది. గతంలో రాష్ట్రప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే పనిదినాల లక్ష్యాన్ని కొంత మేర పెంచుతూ జిల్లాలకు ప్రత్యేక లక్ష్యాలను ఇచ్చేది. కానీ కొత్త సాప్ట్‌వేర్ రావడంతో కేంద్రం సూచనలే అమలవుతున్నాయి.
రెండు రాష్ట్రాల్లో..
ఉపాధి పథకంలో అనేక మార్పులు తీసుకొచ్చిన కేంద్రప్రభుత్వం ఏటా మాదిరిగానే 2023–24 ఆర్థిక సంవత్సరానికి కూలీల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రూ.15 చొప్పున పెంచగా.. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలవుతుంది. ఈ నిర్ణయం ఆధారంగా ఇప్పటి వరకు రూ.257గా వస్తున్న కూలి రూ.272కు చేరుతుంది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని సమయాన ఉపాధి హామీ పనులను వినియోగించుకునే కూలీల సంఖ్య ఉమ్మడి జిల్లాలో ఎక్కువగానే ఉంటోంది. ఈ ఏడాది ఉపాధి పనులను ఖమ్మం జిల్లాలో 3.22 లక్షల మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2.33 లక్షల మంది వినియోగించుకున్నారు.
ఉపాధి కూలీలకు వేతనం రూ.15 పెంపు
వచ్చేనెల 1వ తేదీ నుంచి అమలుకు కేంద్రం ఉత్తర్వులు
ఉమ్మడి జిల్లాలో 5.55 లక్షల మందికి లబ్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉమ్మడి జిల్లాలో ఉపాధి పనుల వివరాలు..
ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మొత్తం జాబ్‌కార్డులు 3.04 లక్షలు 2.2 లక్షలు
మొత్తం కూలీలు 6.45 లక్షలు 4.58 లక్షలు
యాక్టివ్ జాబ్‌కార్డులు 1.91 లక్షలు 1.35 లక్షలు
పనులకు వెళ్లే కూలీలు 3.22 లక్షలు 2.33 లక్షలు
ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులు రూ.139.42 కోట్లు రూ.122.41 కోట్లు
వేతనాల కింద అందజేసింది రూ.83.42 కోట్లు రూ.81.23 కోట్లు
మెటీరియల్ ఖర్చు రూ.45.31 కోట్లు రూ.32.36 కోట్లు
వేసవిభత్యం లేనట్టేనా?
కూలీలకు వేతనాలు పెంచిన ప్రభుత్వం ఈ ఏడాది కూడా వేసవిభత్యం విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఏటా రాష్ట్ర ప్రభుత్వం కూలీలకు వేసవిభత్యం ప్రత్యేకంగా చెల్లించేది. గతేడాది నుండి కూడా ఇది రద్దయింది. ఈసారైనా వస్తుందని కూలీలు ఆశగా ఎదురు చూస్తుండగా, అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు.

