అశ్వారావుపేటరూరల్: ఏపీలో చోరీ చేసిన బంగారు ఆభరణాలను ఓ దొంగ తెలంగాణలోని అశ్వారావుపేటలో తాకట్టు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి బంగారం ఆభరణాల చోరీకి పాల్పడ్డాడు. అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం వెల్లడైనట్లు తెలిసింది. అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో ఓ స్థానికుడి ఆధార్ కార్డు ప్రూఫ్‌తో తాకట్టు పెట్టి, దాదాపు రూ.8.50 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఏపీ పోలీసులు మంగళవారం అశ్వారావుపేటకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వెళ్లారు. దీనిపై స్థానిక ఎస్‌ఐ బి.రాజేశ్ కుమార్‌ను వివరణ కోరగా.. ఏపీ పోలీసులు విచారణ వాస్తవమేనని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.