
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
●పినపాక నియోజకవర్గంలో ఎస్టీ ఆవాసాలకు బీటీ రోడ్లు ●రూ.100 కోట్ల ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం
బూర్గంపాడు: పినపాక నియోజకవర్గానికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. రూ.57. 75 కోట్లతో ఎస్టీ ఆవాసాల్లో 34 బీటీ రోడ్లు నిర్మించేందుకు మంగళవారం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఈ నిధులు కేటాయించింది. నియోజకవర్గంలోని పినపాక, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో రూ.100 కోట్లతో చేపట్టనున్న 447 అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రాంటు కింద నిధులు కేటాయించనుండగా, పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీటీ రోడ్లు, కనెక్టవిటీ రోడ్లు, కమ్యూనిటీహాల్స్, బస్టాండ్లు, ట్యాంకుల నిర్మాణం చేపట్టనున్నారు. నిధుల విడుదలకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చొరవతీసుకున్నారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రతిపాదనలను సిద్ధం చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేశారని తెలిపారు.