
అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు (ఇన్‌సెట్) పట్టుబడిన కానిస్టేబుల్ రాంబాబు
కొత్తగూడెంటౌన్/అశ్వాపురం: కోర్టు కేసులో అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానంటూ ఓ వ్యక్తి వద్ద కోర్టు కానిస్టేబుల్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. అశ్వాపురం మండలం ఎలకలగూడెం గ్రామానికి చెందిన జంపన్న, భూక్యా చంటిపై 2022లో అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. కాగా, జంపన్న ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ఎంపికల్లో అర్హత సాధించాడు. అయితే గతంలో ఏమైనా కేసులుంటే విచారణలో నష్టం వాటిల్లుతుందని భయపడుతున్న క్రమంలో.. అశ్వాపురం పీఎస్‌లో పనిచేస్తున్న కోర్టు కానిస్టేబుల్ భూక్యా రాంబాబు ఈ విషయం గమనించాడు. విచారణ తుది దశకు వచ్చినందున తనకు రూ.15వేలు లంచం ఇస్తే కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చేలా చూస్తానని నమ్మబలికాడు. దీంతో జంపన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లో కానిస్టేబుల్ రాంబాబుకు రూ.10 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. రాంబాబుపై కేసు నమోదు చేశారు.
రూ.10వేలు లంచం తీసుకుంటూ
పట్టుబడిన రాంబాబు
