
లహరి ఏసీ స్లీపర్ బస్సు
చుంచుపల్లి: హైటెక్ హంగులతో టీఎస్‌ఆర్టీసీ ప్రారంభించిన ఏసీ స్లీపర్ లహరి బస్సు కోసం జిల్లా వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం మొదటి విడతలో 16 ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురాగా, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభించారు. అయితే ఈ బస్సులు బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చైన్నె ప్రాంతాలకు మాత్రమే నడపాలని నిర్ణయించారు. తిరుపతి తర్వాత అతి పెద్ద పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రగిరికి కూడా లహరి బస్సు ఏర్పాటు చేయాలని భక్తులు, జిల్లా వాసులు కోరుతున్నారు. భద్రాద్రి జిల్లా నుంచి నిత్యం సుమారు 3వేల మంది హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లా నుంచి ఏసీ బస్సులు సైతం అరకొరగానే నడుస్తున్నాయి. వేసవికాలం దృష్ట్యా ఏసీ బస్సులకు ఆదరణ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్న ఏసీ బస్సులు సరిపోక పలువురు ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతుంటాయి. వేసవి కాలం దృష్ట్యా లహరి ఏసీ స్లీపర్ బస్సు సర్వీసును ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు అంటున్నారు.
పరిశ్రమలకు నిలయం..
జిల్లాలో కేటీపీఎస్, సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ, భద్రాద్రి పవర్ ప్లాంట్, ఎన్‌ఎండీసీ, నవభారత్ వంటి పలు పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు ఎక్కువగా హైదరాబాద్‌కు వెళ్లి వస్తుంటారు. వివిధ పరిశ్రమల పనిమీద ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు సైతం జిల్లాకు వస్తుంటారు. దీనికి తోడు ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలానికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ప్రస్తుతం నడుస్తున్న గరుడ, రాజధాని వంటి ఏసీ బస్సులను ఆశ్రయిస్తున్నా.. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఇవి లేకపోవడంతో నాన్ ఏసీ బస్సుల్లో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు 320 కిలోమీటర్లు ఉండగా సుమారు 6.30 గంటలు పడుతుంది. ఇంతదూరం కూర్చుని ప్రయాణించాలంటే పలువురు ఇబ్బంది పడుతున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ చూపి భద్రాచలం రాములోరి పుణ్యక్షేత్రానికి లహరి ఏసీ స్లీపర్ బస్సును కేటాయించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
భద్రగిరికి స్లీపర్ బస్సు కావాలంటున్న భక్తులు
మంత్రి చొరవ చూపాలంటున్న
జిల్లా వాసులు
జిల్లాకు ఏసీ స్లీపర్ బస్సు కేటాయించాలి
జిల్లా ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ స్లీపర్ బస్సు కేటాయించాలి. నిత్యం జిల్లా నుంచి ఎక్కువ మంది హైదరాబాద్ వెళ్తుంటారు. తొలి ప్రాధాన్యతలోనే భద్రగిరికి లహరి బస్సు అవకాశం కల్పించాలి. ఇందుకోసం అధికారులు చొరవ చూపాలి.
– కె.కోటేశ్వరరావు, కొత్తగూడెం వాసి
