
ధ్వజపటం వద్ద పూజలు చేస్తున్న అర్చకులు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకల్లో భాగంగా యాగశాలలో శ్రీరామాయణ క్రతువును రుత్విక్‌లు, వేదపండితులు నిర్విఘ్నంగా జరిపిస్తున్నారు. చతుర్వేద హవనాలు, రామాయణ హవనం, రామషడాక్షరీ, నారాయణ అష్టాక్షరి మంత్రాలను జపించారు. అనంతరం రుత్విక్‌లు సంక్షేప రామాయణ సామూహిక పారాయణం నిర్వహించారు.
ఘనంగా గరుడాధివాసం..
వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం గరుడాధివాసం, ధ్వజపట లేఖనం కార్యక్రమాలను వైభవంగా జరిపించారు. బ్రహ్మోత్సవాలకు ప్రధాన సంకేతమైన గరుత్మంతుడి బొమ్మను వస్త్రంపై లిఖించారు. జీయర్ మఠంలో ఈ వేడుకను అర్చకులు నిష్టగా, సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం అక్కడి నుంచి శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. గరుత్మంతుడి చిత్రపటానికి హారతి సమర్పించి పూజలు చేశారు. పూజల్లో త్రిదండి రామానుజ జీయర్ స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, స్థానాచార్యులు స్థలశాయి, వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, చతు స్థానార్చన జరపనున్నారు. సంతానం లేని మహిళలు గరుడ ప్రసాదం స్వీకరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని ప్రతీతి. కాగా, సాయంత్రం సార్వభౌమ సేవ నిర్వహించారు.
నిత్యాన్నదానానికి ఐటీసీ బియ్యం వితరణ
దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే నిత్యాన్నదాన కార్యక్రమానికి ఐటీసీ పీఎస్‌పీడీ సంస్థ తరఫున ప్రతినిధులు 25 క్వింటాళ్ల బియ్యం వితరణగా ఈఓ రమాదేవికి అందజేశారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన భక్తులు గోటి తలంబ్రాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. గిరి ప్రదక్షిణ అనంతరం ఈఓకు అందజేశారు. ఏఈఓలు శ్రావణ్‌కుమార్, భవానీ రామకృష్ణ పాల్గొన్నారు.
భక్తి ప్రపత్తులతో
ధ్వజపట లేఖనం
శాస్త్రోక్తంగా కొనసాగుతున్న హోమాలు
ముత్తంగి అలంకరణలో
స్వామివారి దర్శనం
ఉత్సాహంగా సాగిన సార్వభౌమ సేవ
ముత్తంగి రూపం.. నయనానందకరం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని సోమవారం ముత్తంగి రూపంలో అలంకరించారు. హైదరాబాద్‌కు చెందిన దాతలు రూ. 30 లక్షల విలువైన కవచాలను అందజేయగా, వాటిని స్వామివారికి ధరింపజేశారు. ముత్తంగి రూపంలో దర్శనమిచ్చిన స్వామివారిని తిలకించిన భక్తులు పరవశించిపోయారు. కాగా, స్వామివారిని త్రిదండి రామానుజ జీయర్ స్వామి సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు పరివట్టం కట్టి స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తుల వద్ద, ఉపాలయాల్లో పూజలు చేశారు. జీయర్ స్వామి వెంట ఆలయ అర్చకులు, వేద పండితులు, జీయర్ మఠం నిర్వాహకులు ఉన్నారు.

యాగశాలలో హోమం చేస్తున్న రుత్విక్‌లు

ముత్తంగి అలంకరణలో స్వామివారి ఉత్సవమూర్తులు