నేలకొండపల్లి: బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకరి పేరిట ఖాతా పుస్తకాన్ని మరొకరికి జారీ చేయడంతో డబ్బులు డ్రా చేసిన ఘటన ఇది. ఈ విషయమై అధికారులను ఖాతాదారుడు నిలదీయడంతో తప్పు సరిదిద్దేందుకు యత్నిస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని బోదులబండకు చెందిన షేక్ మహమ్మద్ పాషాకు నేలకొండపల్లి యూనియన్ బ్యాంకు బ్రాంచ్‌లో ఖాతా ఉంది. ఈ ఖాతాలో రూ.లక్ష వరకు నగదు నిల్వ ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్‌కు కూడా ఇదే బ్యాంకులో ఖాతా ఉండగా తన పాస్‌పుస్తకం పోయిందని గత నెలలో బ్యాంకు అధికారులను సంప్రదించడంతో వివరాలు సరిచూసుకోకుండా షేక్ మహమ్మద్ పాషా పేరిట ఉన్న ఖాతా పాస్ పుస్తకం జారీ చేశారు. ఆ ఖాతాలో నగదు ఉండడంతో షేక్ హమ్మద్ ఖాతా నుంచి రూ. లక్ష నగదు డ్రా చేశాడు. ఈ విషయం పాషా ఫోన్‌కు మెసేస్ రావడంతో ఆయన బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే డబ్బులు డ్రా చేసింది నీవేనని వాదించారు. కానీ తాను బ్యాంకుకే రాలేదని స్పష్టం చేయడంతో ఓచర్లు తనిఖీ చేయగా సంతకం పాషాది కాదని తేలింది. దీంతో అధికారులు తప్పును సరిదిద్దే ప్రయత్నం ప్రారంభించారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ రాజేష్‌ను సోమవారం వివరణ కోరగా సాంకేతిక లోపంతో ఎదురైన సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
రూ.లక్ష మేర డ్రా చేయడంతో
బయటపడిన వైనం