ఆదాయం అదుర్స్‌...

డిజిటల్‌ క్యూ ఆర్‌ కోడ్లు చూపిస్తున్న ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి - Sakshi

● కేఎంసీకి పెరిగిన ఆస్తిపన్ను రాబడి ● ఈ ఏడాది రూ.31.24 కోట్లలో రూ.24.94 కోట్ల వసూలు ● మరో నాలుగు రోజుల్లో మిగతాది వసూలు చేసేలా కార్యాచరణ ● జీఎంహెచ్‌సీ మినహా రాష్ట్రంలోనే కేఎంసీకి మొదటి స్థానం

ఖమ్మంమయూరిసెంటర్‌: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రజలు చెల్లించే పన్నులే ప్రధాన వనరులు. ఇందులో అత్యధికంగా ఆస్తి, పంపు పన్నుల నుండే సమకూరుతుంది. ఈమేరకు ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌(కేఎంసీ) అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో వసూళ్లు పెరిగాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022–23 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నులు ఇప్పటి వరకు 10 శాతం అదనంగా వసూలైనట్లు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలోనే జీహెచ్‌ఎంసీ మినహాయిస్తే మొదటి స్థానంలో ఖమ్మం నిలిచింది.

రూ.24.94 కోట్లు ఆదాయం..

ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నివాస గృహాలు, వ్యాపార సముదాయాలు పెరుగుతుండడంతో ఏటా పన్నుల డిమాండ్‌ పెరుగుతూ వస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో కేఎంసీకి ఆస్తి పన్నుల రూపంలో రూ.30 కోట్లకు గాను రూ.22 కోట్లు వసూలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం 70 వేల అసెస్‌మెంట్లకు సంబంధించి రూ.31.24 కోట్ల ఆస్తి పన్నులో ఇప్పటి వరకు రూ.24.94 కోట్లు వసూలు చేశారు. గతేడాదితో పోలిస్తే 10 శాతంపైగా ఇది అదనం.

సత్ఫలితాలను ఇస్తున్న ప్రయత్నాలు

ఆస్తి పన్నులతో పాటు పంపు పన్నుల బకాయిలు వసూళ్ల కోసం కేఎంసీ కమిషనర్‌ సహా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నోటీసులు జారీ చేయడమే కాక బకాయిదారులకు అవగాహన కల్పిస్తుండడంతో పన్ను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. కేఎంసీ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి పన్ను చెల్లింపుదారులకు పోస్ట్‌ ద్వారా నోటీసులు పంపించడం, సెల్‌ నంబర్లకు మెస్సెజ్‌లు పంపిస్తుండడంతో పలువురు చెల్లించారు. గతేడాది పంపు పన్నుల లక్ష్యం రూ.8 కోట్లు ఉండగా.. కేవలం రూ.60 లక్షలు మాత్రమే రాబట్టగలిగారు. ఈఏడాది మాత్రం రూ.9 కోట్ల లక్ష్యంలో రూ.3 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.

నాలుగు రోజులే..

2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. ఈ సమయంలో ఆస్తి పన్ను రూ.6 కోట్లు, పంపు పన్నులు రూ.6 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అధికారులు చేపట్టిన చర్యలతో మంచి ఫలితాలు వచ్చిన నేపథ్యాన మిగిలిన సమయంలో కూడా పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. గడువులోగా చెల్లించకుంటే ఏప్రిల్‌ 1వ తేదీ నుండి బకాయిలపై రెండు శాతం జరిమానా పడుతుందనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. కాగా, ఖమ్మం మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్‌గా మారాక పలు పంచాయతీలను విలీనం చేయడంతో సమాచారం అంతా అధికారులు ఆన్‌లైన్‌ చేశారు. ఈక్రమంలో తప్పులు దొర్లగా పన్ను చెల్లించిన వారు కూడా బకాయి ఉన్నట్లు నోటీసులు అందాయి. ఇలా కేఎంసీలో 655 దరఖాస్తులు రాగా.. వీటిల్లో 547 దరఖాస్తులను పరిష్కరించారు.

పన్నులు చెల్లించి సహకరించండి..

ప్రజలు చెల్లించే పన్నులతోనే అభివృద్ధి జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించి సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా నాణ్యమైన మరిన్ని సేవలు పొందాలి. ఇంకా నాలుగు రోజుల గడువే ఉన్నందున పన్నులు, బకాయిలు చెల్లిస్తే జరిమానా నుంచి మినహాయింపు పొందొచ్చు.

– ఆదర్శ్‌ సురభి, కమిషనర్‌, కేఎంసీ

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top