పార్కింగ్‌, ఫైర్‌ సేఫ్టీ ఉండవు! | - | Sakshi
Sakshi News home page

పార్కింగ్‌, ఫైర్‌ సేఫ్టీ ఉండవు!

Mar 28 2023 12:18 AM | Updated on Mar 28 2023 12:18 AM

- - Sakshi

●బహుళ అంతస్తుల నిర్మాణాల్లో నిబంధనలకు నీళ్లు ●జిల్లా కేంద్రంలో తీరు మారని భవన యజమానులు ●సెల్లార్లలో కూడా గదులు నిర్మిస్తున్న అక్రమార్కులు ●చోద్యం చూస్తున్న మున్సిపల్‌, అగ్నిమాపక శాఖలు ●పొంచి ఉన్న ప్రమాదాలతో భయాందోళన

కొత్తగూడెంఅర్బన్‌: నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపట్టిన బహుళ అంతస్తుల భవనాల్లో ఇటీవల పలు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు మేల్కొనడం లేదు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో నిర్మాణాలను పరిశీలిస్తే నిబంధనలు పాటించడం లేదనే విషయం వెల్లడవుతోంది. మున్సిపల్‌, ఫైర్‌ సేఫ్టీ అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడకపోవడంతో ఏ మాత్రం భయం లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు.

నిబంధనలు పాటించని నిర్మాణదారులు

జిల్లా కేంద్రంలో ఆరు నెలల కాలం నుంచి బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ భవనాల యజమానులు నిబంధనలు పాటించడంలేదు. పట్టణంలోని గొల్లగూడెం, మేదరబస్తీ, గణేష్‌బస్తీ, బస్టాండ్‌ సమీపంలో సెల్లార్లలో అక్రమంగా గదులు నిర్మిస్తున్నారు. మరికొన్ని చోట్ల సెల్లార్లను పార్కింగ్‌కు వినియోగించకపోవడంతో వాహనాలను రోడ్లపైనే పార్కింగ్‌ చేయాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. బహుళ అంతస్తుల భవనానికి కనీసం మూడు వైపులా ఫైర్‌ ఇంజన్‌ తిరిగే విధంగా నిర్మాణాలు చేపట్టాలి. కానీ ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలకు ఒకవైపు కూడా ఫైరింజన్‌ తిరిగే పరిస్థితి లేదు. దీని వల్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటే భారీగా ఆస్తినష్టం, ప్రాణానష్టం జరిగే అవకాశాలుంటాయి.

పట్టించుకోని మున్సిపల్‌, అగ్నిమాపక అధికారులు

జిల్లా కేంద్రంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నా మున్సిపల్‌, ఫైర్‌ సేఫ్టీ అధికారులు దాడులు, తనిఖీలు చేపట్టడంలేదు. 2021 సంవత్సరంలో మున్సిపాలిటీల్లో టీఎస్‌ బిపాస్‌ ప్రారంభమైంది. టీఎస్‌ బిపాస్‌ ద్వారా అనుమతి పొందాకే భవన నిర్మాణాలు చేపట్టాలి. అనుమతి లేని భవనాల యజమానులపై చర్యలు తీసుకునేందుకు 2021లోనే కలెక్టర్‌ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోరం టీం పలు చోట్ల దాడులు నిర్వహించింది. అనుమతులు లేని బహుళ అంతస్తుల నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసింది. రెండు నెలలపాటు దాడులు చేసిన అధికారులు ఆ తర్వాత మిన్నకుండిపోయారు. తనిఖీలు లేకవడంతో అక్రమార్కులు యథేచ్చగా నిర్మాణాలు చేస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో జీ ప్లస్‌ టూ నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉంది. ఆపై బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టాలంటే వరంగల్‌లోని మున్సిపల్‌ శాఖ రీజినల్‌ కార్యాలయం నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు నిర్మాణదారులు అవేమీ పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీలో తీసుకునే అనుమతి ఒకలా ఉంటే, భవన నిర్మాణం మరోలా ఉంటోంది. సెడ్‌ బ్యాకు లేకుండా నిర్మాణాలు చేయడంతోపాటు సెల్లార్‌ నిబంధనలు పాటించడం లేదు.

పట్టణంలో కొన్ని భవనాలను పరిశీలిస్తే..

కొత్తగూడెం బస్టాండ్‌ సెంటర్‌ సమీపంలో వైన్‌షాపు వెనుకభాగంలో ఓ బహుళ అంతస్తులో సెల్లార్‌లో రూం నిర్మాణం చేశారు. ఆ భవనానికి ఒక వైపు కూడా ఫైర్‌ ఇంజన్‌ వాహనం తిరిగే అవకాశం లేదు. గొల్లగూడెంలో ఓ బార్‌షాపు ఎదురుగా నిర్మిస్తున్న మరో బహుళ అంతస్తు భవనం సెల్లార్‌లో పార్కింగ్‌ ఏర్పాటు చేయకుండా కమర్షియల్‌కు ఉపయోగపడే నిర్మాణాలు చేస్తున్నారు. ఇక గణేష్‌టెంపుల్‌ ఏరియా, గణేష్‌బస్తీ, బూడిదగడ్డలోని మహాంకాళి టెంపుల్‌ సమీపంలో, పాత కొత్తగూడెం ఏరియాల్లో అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోకుండానే అపార్టుమెంట్లు నిర్మిస్తున్నట్లు సమాచారం.

చర్యలు తీసుకుంటాం

మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు తప్పనిసరి. నిర్మాణదారులు సెల్లార్‌ను పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలి. కొత్తగూడెంలో నిర్మాణాల అనుమతికి మించి ఉంటే వరంగల్‌ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. భవన నిర్మాణాలను తనిఖీ చేసి తేడాలుంటే చర్యలు తీసుకుంటాం.

– రఘు, మున్సిపల్‌ కమిషనర్‌, కొత్తగూడెం

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement