మణుగూరుటౌన్: హత్యకేసులో ఓ వ్యక్తికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ సోమవారం తీర్పు చెప్పారు. తీర్పు వివరాలు.. మండలంలోని శివలింగాపురానికి చెందిన కుంజా లక్ష్మణ్ 2018, మే 5న చండ్రుగొండ మండలం బెండాలపాడులో బంధువుల వివాహానికి హాజరయ్యాడు. అక్కడ లక్ష్మణ్, మడకం జయరాజుతో కలిసి మద్యం తాగాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కుంజా సోమయ్య జయరాజుతో గొడవపడ్డాడు. దీంతో లక్ష్మణ్ వెళ్లి ఛాతీపై కొట్టడంతో సోమయ్య మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు చండ్రుగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. 17 మంది సాక్షుల విచారణ అనంతరం లక్ష్మణ్‌పై నేరం రుజువు కావడంతో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే మరో నెల రోజులు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో కోర్టు లైజన్ అధికారి ఎన్.వీరబాబు, చండ్రుగొండ కోర్టు హెచ్‌సీ రవి సహకరించారు.
రూ.లక్ష జరిమానా
వైరా: కొణిజర్ల మండలం తుమ్మలపల్లికి చెందిన నూనావత్ రవి నాటు సారా విక్రయిస్తూ పట్టుబడగా రూ.లక్ష జరిమానా విధించారు. గతంలో ఓసారి పట్టుబడిన రవిని బైండోవర్ చేయగా, మళ్లీ సారా అమ్ముతున్నాడు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించడంతో తహసీల్దార్ సైదులు సోమవారం జరిమానా విధించారని ఎకై ్సజ్ ఎస్సై రమ్యారెడ్డి తెలిపారు.