ఖమ్మంరూరల్: గ్రామాల్లో ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలంటే పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటే అన్నీ పరిశీలించి అనుమతి జారీ చేస్తారు. కానీ మండలంలోని ఏదులాపురం గ్రామపంచాయతీ పరిధిలో మాత్రం కార్యదర్శిని సంప్రదించకుండానే అనుమతులు తీసుకోవచ్చు. ఇందుకోసం కొంత ఖర్చు చేస్తే సరిపోతుంది. ఇలా అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిపై ఫిర్యాదు అందడంతో ఖమ్మం రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వివరాలు... ఏదులాపురానికి చెందిన పలువురి ఇళ్ల నిర్మాణానికి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి కొన్నాళ్ల నుంచి అనుమతి పత్రాలు జారీ చేస్తున్నాడు. ఇందుకోసం గ్రామ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాక, నకిలీ స్టాంప్‌లు తయారుచేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామకార్యదర్శి నాగరాజు ఫిర్యాదు చేయడంతో సోమవారం లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపారు. కాగా, లక్ష్మారెడ్డి ఇంటి అనుమతి పత్రాలు ఇచ్చేందుకు రూ.వేలు మొదలు రూ.లక్షలు వరకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆపై ఇంటి అనుమతులు జారీ