రైతులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిఉండాలి | - | Sakshi
Sakshi News home page

రైతులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిఉండాలి

Apr 30 2026 8:01 AM | Updated on Apr 30 2026 8:01 AM

బాపట్ల: గ్రామీణ జీవనానికి వ్యవసాయం వెన్నెముక వంటిదని, పి.జి.విద్యార్థులు తమ పరిశోధనలు, ప్రయోగాలు, నూతన ఆలోచనలు, ఆవిష్కరణలను గ్రామీణ వ్యవసాయదారుల చెంతకు తీసుకెళ్లడంలో కృషి చేయాలని, అప్పుడే వారి విద్యకు సార్ధకత చేకూరుతుందని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ అఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ కె.రత్న శీలామణి అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహిస్తున్న పి.జి. విద్యార్థుల జాతీయ సదస్సు– 2026లో ముగింపు సభ బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు తెచ్చేందుకు వారు చేస్తున్న ప్రయోగాలు సత్ఫాలితాలను ఇవ్వాలని, సుస్థిరమైన సేద్య రూపకల్పన దిశగా వారి విద్య కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ డాక్టర్‌ జి.రామచంద్ర రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా17 వ్యవసాయ విశ్వ విద్యాలయాల నుంచి 820 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారని, వారిలో 60 శాతం మంది మహిళలు పాల్గొనడం విశేషమన్నారు. గౌరవ అతిధిగా పాల్గొన్న సంగం సీడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణ ప్రతి ఏటా వందలాది పరిశోధనా పత్రాలు సమర్పించబడుతున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తొలుత అసోసియేట్‌ డీన్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ ఎస్‌.ఆర్‌. కోటేశ్వరరావు స్వాగతోపన్యాసం చేశారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ కె. శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో కో ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ లాల్‌ అహమ్మద్‌ మొహమ్మద్‌, డాక్టర్‌ టి.వి.శ్రీధర్‌, స్టూడెంట్‌ టీచర్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.వి.ఎస్‌.అక్షయ్‌ పాల్గొన్నారు. స్టూడెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నివేదిత వందన సమర్పణ చేశారు.

–డాక్టర్‌ కె.రత్నశీలామణి

Advertisement
 
Advertisement
Advertisement