క్రీడల్లో అఖిల్ జిగేల్
పల్లెటూరు నుంచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కరాటే, కిక్ బాక్సింగ్, కుంగ్‌ఫూ, టాంగ్‌టా, మార్షల్ ఆర్ట్ పెన్షింగ్, గట్కా, క్రీడల్లో ప్రతిభ జాతీయ స్థాయిలో పతకాలు ప్రభుత్వ పాఠశాలల్లోని వేలాది మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ 15 సార్లు వివిధ రంగాల ప్రముఖలు నుంచి బెస్ట్ మాస్టర్ అవార్డులు, రెండు గోల్డ్ మెడల్స్
అద్దంకి: కష్టే ఫలి అనే నానుడిని నిజం చేశాడు ఓ యువకుడు. సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన గంటెనపాటి సువార్త, కరుణాకర్ కుమారుడు అఖిల్ ఇస్రాయేల్. చదువుతో పాటు, పలు క్రీడల్లో ప్రావీణ్యం సంపాందించి గిన్నిస్‌తో పాటు లిమ్కా బుక్ ఆప్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. 15 సార్లు బెస్ట్ మాస్టర్ అవార్డు అందుకుని ప్రశంసలు పొందాడు.
బ్రూస్లీ ఆదర్శం
చిన్నతనం నుంచే అఖిల్ బ్రూస్లీ సినిమాలు చూసి, అతని లాగా తాను కూడా చేయాలని అనుకునే వాడు. క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలనే తపన ఉండేది. పేద కుటుంబం కావడం, ప్రోత్సహించేవారే లేకపోవడంతో ఆశయ సాధనలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా పట్టు వదల్లేదు. బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడు. చదవుకు పట్టణం వెళ్లిన సమయంలో అక్కడ వివిధ రకాల క్రీడల్లో ప్రావీణ్యం పొందాడు. 2011 నుంచి మూడు సంవత్సరాల పాటు గుంటూరులో మస్తాన్ అనే గురువు వద్ద కుంగ్‌ఫూ నేర్చున్నాడు. 2014 నుంచి మరో మూడు సంవత్సరాలు హైదరాబాదులోని సుమన్ షోటోకాన్ అకాడమీలో కిక్ బాక్సింగ్, కరాటేలో శిక్షణ పొందాడు. తరువాత మార్షల్ ఆర్ట్ చేసి, బ్లాక్ బెల్ట్‌లు వన్ డౌన్, టూ డౌన్ పొందాడు. జైపూల్‌లో ఐ మాస్ ఇంటర్‌నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 16 దేశాలకు చెందిన వారు పాల్గొన్న ఈవెంట్‌లో రెండు సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. బీపీఈడీ, తరువాత ఎంపీఈడీ చేశాడు.
వరల్డ్ రికార్డుల్లో స్థానం
అఖిల్ గత నెలలో తమిళనాడులో ఈవెంట్‌లో పాల్గొన్నాడు. 15 నిమిషాలు ఆపకుండా పంచ్‌లు, కిక్‌లు ఇచ్చి గిన్నిస్‌తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు సాఽధించాడు. 30 నిమిషాలు అపకుండా ఇచ్చిన ప్రదర్శనల్లో నోబెల్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. స్టిక్ రోటేషన్ (కర్రసామును పోలిన) ఈవెంట్‌లో 12 నిమిషాలు కర్రను ఆపకుండా తప్పి మరో రికార్డు సాధించాడు. టాంగ్‌టా క్రీడలో సిల్వర్ మెడల్ పొందాడు. గట్కా, టాంగ్‌టా క్రీడా ఏపీ కోచ్‌గా ఉన్నాడు. సినీ యాక్టర్ సుమన్, స్టంట్‌మాస్టర్ల చేతుల మీదుగా ఎనిమిది సార్లు బెస్ట్ మాస్టర్ అవార్డు, రామ్ లక్ష్మణ్‌ల నుంచి మూడు సార్లు, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చేతుల మీదుగా ఒక సారి బెస్ట్ మాస్టర్ అవార్డు పొందాడు. కిషన్ రెడ్డి, హీరో ప్రశాంత్, చలపతిరావు, శ్రీశాంత్‌లతో కలుపకుని మొత్తం 15 సార్లు బెస్ట్ మాస్టర్ అవార్డు పొందాడు. వేలాది మందికి తాను నేర్చుకున్న విద్యలను ఉచితంగా నేర్పుతున్నందుకు ఏలూరులో బోధి ధర్మ అవార్డు పొందాడు.
వేలాది మందికి ఉచిత శిక్షణ
నేర్చుకున్న విద్యలను శిష్యులకు నేర్పడంతో పాటు, శిష్యులతో కలిసి అద్దంకి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు. ఇప్పటి వరకూ లక్ష మందికి ఉచిత ఉచిత శిక్షణ ఇచ్చాడు. భవిష్యత్తులో స్పోర్ట్ కోటాల్లో పోలీసు డిపార్ట్‌మెంటులో మంచి ఉద్యోగం సాధించాలని ఆశయంగా పెట్టుకున్నానని అఖిల్ చెప్పాడు.
క్రీడల్లో అఖిల్ జిగేల్


