నిషేధిత జాబితా నుంచి పట్టా భూములు తొలగించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: నిషేధిత భూముల జాబితా నుంచి బాపట్ల జిల్లాలోని పట్టా భూములను అత్యధికంగా తొలగించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. నిషేధిత భూముల జాబితా, చుక్కల భూముల జాబితా నుంచి భూములను తొలగించడంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. అధికారుల సమష్టి కృషితోనే బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, సీఎం నుంచి అందుకున్న ప్రశంసలు రెవెన్యూ అధికారులకే చెందుతాయని కలెక్టర్ చెప్పారు. నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని ఇప్పటి వరకు జిల్లాలో 1,527 అర్జీలు నమోద య్యాయన్నారు. సెప్టెంబర్ నెల నుంచి 597 అర్జీలు పరిష్కారమయ్యాయన్నారు. మిగిలిన 930 అర్జీలు పెండింగ్‌లో ఉండగా శనివారం 42 అర్జీలపై రెవెన్యూ దస్త్రాల పరిశీలన, విచారణ చేపట్టారని తెలిపారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా
లబ్ధిదారులకు విస్తృత సేవలు
బాపట్ల: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పనితీరు బాగుండాలని కలెక్టర్ చెప్పారు. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందేలా కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పనితీరు ఆధారంగా వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా మహిళా సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, సీడీపీఓలు పాల్గొన్నారు.
అధిక ధరలకు యూరియా
విక్రయిస్తే చర్యలు
చీరాల టౌన్: పంటల సాగుకు ముఖ్యమైన యూరియా జిల్లాలో అవసరం మేరకు అందుబాటులో ఉందని, యూరియాను బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. శనివారం చీరాల పట్టణంలోని అన్నపూర్ణ ఫర్టిలైజర్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యూరియా విక్రయాలు చేపట్టాలని అధిక ధరలకు అమ్మకాలు చేస్తే డీలర్ షిప్ రద్దు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని రైతులకు కావాల్సిన యూరియా రైతు సేవా కేంద్రాల్లో అందిస్తుందన్నారు. ప్రతి రైతు యూరియాను కొనుగోలు చేసి రశీదులు పొందాలన్నారు. యూరియాను అధిక ధరలకు అమ్మకాలు చేస్తే కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్ 77028 06804 ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు, ఇన్‌చార్జి వ్యవసాయాధికారి అన్నపూర్ణమ్మ ఉన్నారు.


