కౌన్సిల్ సమావేశం రసాభాస
కోరం లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారన్న వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారంటూ వెళ్లిపోయిన కౌన్సిలర్లు అరగంట ఆలస్యంగా ప్రారంభించిన సమావేశం
చీరాల: చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం రసాభాసాగా సాగింది. ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని ప్రకటించినా అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే కౌన్సిల్ హాలులో 13 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సరైన కోరం లేకుండా సమావేశం ప్రారంభించడంపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు అభ్యంతరాలు తెలిపారు. దీంతో వైఎస్సార్ సీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాడీవేడి వాదనలు మొదలయ్యాయి. ఇలా చేయడం సరికాదంటూ మాట్లాడగా టీడీపీ కౌన్సిలర్లు కూడా వాదనలు వినిపించారు. కోరం లేకుండానే సమావేశం ఎలా నిర్వహిస్తారని మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నించారు. తమకేమి సంబంధం లేదని, మున్సిపల్ చైర్మన్‌ను అడగాలని ఆయన చెప్పారు. చీరాల మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి మొత్తం 35 మంది ఉండాలి. అయితే కౌన్సిల్‌లో 13 మంది ఉన్నా సమావేశం ఎలా నిర్వహిస్తారని కమిషనర్‌ను ప్రశ్నించారు. గతంలోనూ కూడా 18 మంది కౌన్సిలర్లు ఉన్నప్పుడే సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. ఆయన దాటవేత ధోరణితో మాట్లాడడంతో చైర్మన్‌ను అడిగారు. తమకు సంఖ్యా బలం ఉందంటూ ఏకపక్షంగా టీడీపీ కౌన్సిలర్లు సమావేశం నిర్వహించుకుని ఆల్ పాస్ చేయించుకోవాలనే నిర్ణయంతోనే ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. సభను అర్థవంతంగా నిర్వహించడం లేదంటూ బయటకు వెళ్లిపోయారు. అనంతరం సమావేశం ప్రారంభించిన తర్వాత కొద్ది సమయానికి 17మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అజెండాలోని 128 అంశాల్లో పలు అభివృద్ధి పనులను, ఇతర అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. చైర్మన్, చైర్మన్ కుర్చీని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ బత్తుల అనిల్ అగౌరవపరిచారంటూ, ఆయన్ను సస్పెండ్ చేయాలని టీడీపీ కౌన్సిలర్ సత్యానందం ప్రతిపాదించారు. కౌన్సిలర్లు అందరి సూచనలతో ఆయన్ను నెల రోజుల పాటు చైర్మన్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, డీఈ రంగనాఽథ్, టీపీఓ శ్రీనివాసులు, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


