వైద్య కళాశాలలు ప్రజల సొత్తు
15న ‘కోటి సంతకాల’ ప్రతులతో ప్రదర్శన వైద్య కళాశాలల ప్రయివేటీకరణను వ్యతిరేకించేవారంతా తరలిరావాలి మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పిలుపు
బాపట్ల: ప్రభుత్వ నిర్వహణలో మెడికల్ కళాశాలలు ఉండాలని, ప్రజల సొత్తుగా ఉన్న వాటిని ప్రయివేటుపరం చేస్తామంటే ఊరుకునేది లేదని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించిన ప్రతుల ప్యాకింగ్ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. సంతకాలు చేసిన పుస్తకాలను ఈ నెల 15వ తేదీన ఉదయం 10 గంటలకు స్థానిక డీఎం పల్లి నుంచి ప్రదర్శనగా చీలు రోడ్డు వరకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి తాడేపల్లి పంపుతామని కోన చెప్పారు. ఈ ప్రదర్శనలో మెడికల్ కళాశాలలను సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వమే నిర్వహించాలి
మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని కోన రఘుపతి సూచించారు. విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉంటేనే మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గతంలో 17 కళాశాలలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని పేర్కొన్నారు. చంద్రబాబు సర్కారు వచ్చిన మొదటి రోజు నుంచే మెడికల్ కళాశాలలను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకే పనులు నిలుపుదల చేశారని గుర్తు చేశారు. అలా చేయకపోతే 2026 నాటికి కళాశాలలు సేవలు అందించేందుకు వీలు కలిగేదని తెలిపారు. ఒక పక్కన మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు చేయడం, మరో పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.3,600 కోట్లు పెండింగ్‌లో పెట్టి పేదల ఆరోగ్యంతో చంద్రబాబు సర్కారు చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు.
బాపట్ల అభివృద్ధికి పెద్ద దెబ్బ
బాపట్ల మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేయకపోవటంతో అభివృద్ధిపై పెద్ద దెబ్బ పడిందని కోన చెప్పారు. పట్టణానికి కిలోమీటర్లు దూరంలో 56 ఎకరాలు స్థలాన్ని ఉచితంగా కేటాయించామని గుర్తుచేశారు. రూ.510 కోట్లతో పనులు జరుగుతుండగా వాటిని నిలుపుదల చేయటం బాధాకరమైన విషయమన్నారు. ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెడికల్ కళాశాలను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, నాయకులు కూనపురెడ్డి ఆవినాష్ నాయుడు, జోగి రాజా, ఇనగలూరి మాల్యాద్రి, కటికల యోహోషువా, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, అక్కల శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.


