12న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా
ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ
రేపల్లె: అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా తలపెట్టినట్లు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీ చెప్పారు. మంగళవారం సీడీపీవో సుచిత్రకు డిమాండ్ నోటీసు అందజేసి ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీల జీతాలు పెంపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సమస్యల పరిష్కారానికి ధర్నా చేపట్టాలని పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు అందించాలని, నిబంధనల ప్రకారం హెల్పర్‌లకు ప్రమోషన్‌లు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. పనిభారం తగ్గించి యాప్‌లన్నీ ఒక యాప్‌గా రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి 5జీ ఫోన్‌లను అందించాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్, లబ్ధిదారులకు నాణ్యమైన కందిపప్పు, ఆయిల్ అందించాలని పేర్కొన్నాన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 164 సూపర్‌వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలు, ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రేపల్లె ప్రాజెక్ట్ అధ్యక్షురాలు కె.రత్నకుమారి, సీఐటీయూ గౌరవాధ్యక్షుడు మణిలాల్, తదితరులు పాల్గొన్నారు.


