పేదల ప్రాణాలు తీస్తున్న పెద్దాసుపత్రి
రెండు వారాల వ్యవధిలో రెండు ప్రాణాలను బలిగొన్న నిర్లక్ష్యం బాధితులు ఫిర్యాదు చేసే వరకు చలించని ఆసుపత్రి అధికారులు రాత్రి వేళల్లో వైద్యం అందక అల్లాడుతున్న రోగులు మారు వేషాల్లో తనిఖీలు చేసినా, హెల్త్ సెక్రటరీలు తనిఖీలు చేసినా తీరు మార్చుకోని సిబ్బంది
గుంటూరుమెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో వైద్యు లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణా లను బలిగొంది. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు రోగులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆసుపత్రి అధికారులకు బాధితులు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారు లు సైతం ఆసుపత్రిలో తనిఖీలు చేసినా వైద్యులు, వైద్య సిబ్బంది తీరులో మార్పు రాలేదు.
ఎమర్జెన్సీ మెడిసిన్‌లో..
అత్యవసర చికిత్స కోసం వచ్చేవారంతా ఎమర్జెన్సి మెడిసిన్ డిపార్టుమెంట్‌లోనే చేరుతున్నారు. ఇక్కడ వైద్యులు ఎవరూ రాత్రి వేళ అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభు త్వం అధికారికంగా నియమించిన ఆర్‌ఎంఓలు తమకు రాత్రి వేళ డ్యూటీలు పట్టవంటూ క్యాజువాలిటి మెడికల్ ఆఫీసర్లుగా ఉద్యోగాల్లో చేరిన వారిని తమ విధులు చేయాలని ఆదేశిస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరబ్‌గౌర్ నవంబరు 29న జీజీహెచ్‌లో మూడు గంటలకు పైగా ఆకస్మిక తనిఖీలు చేశారు. సీనియర్ వైద్యులు విధుల్లో ఉండకుండా వైద్య విద్యార్థులు, జూనియర్ విద్యార్థుల ద్వారానే ఎక్కువ శాతం ఓపీ సేవలు జరుగుతున్న విషయాన్ని గుర్తించి తప్పనిసరిగా ప్రతి వైద్యుడి డేటా తనకు అందించాలని ఆదేశించారు. అయినప్పటికీ ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు ఓపీ వేళల్లో అందుబాటులో ఉండటం లేదు. ముఖ్యంగా వైద్య విభాగాధిపతులు కొంత మంది ఓపీ విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్నారు.
మారు వేషం తప్ప చర్యలు ఏవి?
ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరు పర్యవేక్షించేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ రెండు పర్యాయాలు మారు వేషాలలో ఆసుపత్రిలో తనిఖీలు చేసినా వైద్యులు, వైద్య సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. తనిఖీల్లో ఆసుపత్రిలో అంతా బాగుందని సూపరింటెండెంట్ మీడియాకు వెల్లడించడంతో వైద్యులు, వైద్య సిబ్బందిలో ఏమాత్రం భయం లేకుండాపోయింది.


