రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
తాడేపల్లి రూరల్: ద్విచక్రవాహనంపై వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై ఓ విద్యా ర్థిని మృతి చెందిన సంఘటన తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ఎస్‌కే సమియా (18) ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉదయం బస్సులో వర్సిటీకి వచ్చింది. పరీక్షల అనంతరం తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కకుండా తన స్నేహితుడైన లయోలా కాలేజీలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న మచిలీపట్నానికి చెందిన విన్సెంట్ ద్విచక్ర వాహనంపై విజయవాడకు బయలుదేరింది. ఈ క్రమంలో కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు దారితప్పి వచ్చిన హార్వెస్టర్ లారీ టోల్‌గేటు నుంచి వెనక్కి వస్తోంది. దీని పక్క నుంచి ద్విచక్రవాహనం వెళుతుండగా లారీ తగిలింది. విన్సెంట్ ఎడమవైపు, సమియా కుడివైపు పడిపోయారు. సమియాపై లారీ వెనుక టైరు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమియా మృతదేహం వద్ద విన్సెంట్ విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. తాడేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


