నేడు కోటప్పకొండలో ఆరుద్రోత్సవం
త్రికోటేశ్వరునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కోటయ్య మాలధారులకు జ్యోతిదర్శనం తరలిరానున్న వేలాది మంది భక్తులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
నరసరావుపేట రూరల్: శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం ఆరుద్రోత్సవానికి ముస్తాబైంది. శనివారం ఆరుద్రోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించే తిరునాళ్ల తరువాత ఆలయంలో నిర్వహించే అతిపెద్ద కార్యక్రమం ఆరుద్రోత్సవం. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఆరుద్రోత్సవంలో పాల్గొంటారు. దీంతోపాటు కోటయ్య మాలధారులు కొండకు చేరుకుని మాలవిరమణ చేపడతారు. ఇందు కోసం ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. శనివారం అర్ధరాత్రి నుంచి స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు.
మహారుద్రాభిషేకం
ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని త్రికోటేశ్వరస్వామి వారికి మహారుద్రాభిషేకాన్ని విశేషంగా నిర్వహించనున్నారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, సుగంధ ద్రవ్యాలు, విబూది, గంధం, కుంకుమ, తైలం, అన్నాభిషేకం నిర్వహించిన అనంతరం స్వామివారికి విశేష అలంకరణలు చేయనున్నారు. అర్ధరాత్రి 12గంటల నుంచి ప్రారంభయ్యే అభిషేకాలు తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి. ఆలయ యాగశాలలో ఆదివారం ఉదయం 8గంటలకు గణపతి హోమం, రుద్రహోమం, శాంతి హోమం, వాస్తు హోమం, పుర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి.
మాలధారులకు ప్రత్యేక ఏర్పాట్లు
కోటయ్య మాల దీక్ష చేపట్టిన భక్తులు ఆరుద్రోత్సవం రోజున కోటప్పకొండకు చేరుకుంటారు. నరసరావుపేటతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి మాలధారులు కొండకు వస్తారు. లింగంగుంట్ల కాలనీ శివాలయం నుంచి భక్త బృందం కాలినడకన కొండకు చేరుకుని ఇరుముడులు స్వామి వారికి సమర్పించి మాల విరమణ చేస్తారు. మాలధారుల కోసం ఆలయం వెనుక ఉన్న అభిషేక మండపంలో ఏర్పాట్లు చేశారు. మాలధారులకు జ్యోతిదర్శనం ఏర్పాటు చేశారు.
భక్తులకు అన్నదానం
ఆరుద్రోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాలుగా స్వామి వారి భక్తుల సహకారంతో అన్నప్రసాదాల పంపిణీ నిర్వహిస్తున్నారు. నరసరావుపేటకు చెందిన తాళ్ల వెంకట కోటిరెడ్డి, శీలం జయరామిరెడ్డి, అల్లు రమేష్‌లు ప్రతి ఏడాది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా వీరు భక్తులకు అన్నప్రసాదం అందించనున్నారు.
నేడు కోటప్పకొండలో ఆరుద్రోత్సవం


