అసౌకర్యాల నుంచి విముక్తి కల్పించండి
బల్లికురవ: గ్రామ పంచాయతీ పాలక మండలి మధ్య విభేదాలతో 18 నెలలుగా అసౌకర్యాలతో సహవాసం చేస్తున్నామని కొప్పరపాడు గ్రామస్తులు శుక్రవారం కలెక్టర్ వి. వినోద్‌కుమార్‌కు విన్నవించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలు గ్రామంలో ముందుకు కదలని మురుగు, ఉన్నత పాఠశాలలకు వెళ్లే ప్రధాన రహదారిపై నీరు ప్రవహించటంతో ఇబ్బందులు పడుతున్నామని డ్రైనేజ్ వ్యవస్థ పటిష్టంతోపాటు వ్యర్థాలను గ్రామానికి దూరంగా తరలించాలని కలెక్టర్‌కు విన్నవించారు. పంచాయతీలో ఎలక్ట్రికల్ బాయ్‌గా 10 నెలలు పనిచేశానని తనకు జీతం చెల్లించకపోగా విధుల నుంచి తొలగించారని ఎస్‌కే సుభాని కలెక్టర్‌కు విన్నవించారు. కుక్కలు వీధుల్లో సంచరిస్తూ వృద్ధులు, చిన్నారులు, గొర్రెలపై దాడి చేశాయని వివరించారు. కలెక్టర్ స్పందిస్తూ గ్రామంలో ఇన్ని సమస్యలుంటే మీరేమి చేస్తున్నారని ఎంపీడీఓ కుసుమకుమారిని ప్రశ్నించారు. పాలకమండలి సర్పంచ్ మధ్య విభేదాల వల్లే పనులు జరగటంలేదని ఎంపీడీఓ చెప్పటంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే గ్రామంలోని సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి బాటలు వేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్‌కు సమస్యలను విన్నవించిన కొప్పరపాడు గ్రామస్తులు


