ఇష్టపడి చదివితే ఉన్నత భవిత
బల్లికురవ: విద్యార్థులు కష్టపడి.. ఇష్టపడి చదివితే లక్ష్యాలను సులువుగా సాధించవచ్చని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొప్పరపాడు ఉన్నత పాఠశాలలో జరిగిన పీటీయంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు అన్ని వసతులు కల్పించటం వల్ల ఫలితాల్లో కూడా అగ్రభాగంలో ఉంటున్నాయని ఇందుకు నిదర్శనమే కొప్పరపాడు పాఠశాల అని హెచ్‌ఎం పి. శ్రీనివాసరావు ఉపాధ్యాయులను అభినందించారు. గత 5 సంవత్సరాలుగా విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో సాధించిన ప్రతిభను హెచ్‌ఎం ఈ సందర్భంగా వివరించారు. విద్యార్థులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని రుచిచూసి నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో విద్యార్థులు వీరాంజనేయులు, సాయి, ఆకాష్, వంశీ, జోసఫ్‌తో కలెక్టర్ మాట్లాడారు. మీరు ఏమి చదివి ఏమి కావాలనుకుంటున్నారని ప్రశ్నించగా డాక్టర్, లాయర్, కలెక్టర్, పోలీస్, ఇంజినీరు కావాలని చెప్పడంతో సంతోషించి ఎంత కష్టం వచ్చినా ఇష్టంతో చదవాలని సూచించాచారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రవినాయక్, ఎంపీడీఓ కుసుమకుమారి, ఎంఈవో 1,2లు కె. శ్రీనివాసరావు, కె. రమేష్‌బాబు పాల్గొని మాట్లాడారు.


