 
															ప్రజలను అప్రమత్తం చేయండి
బాపట్ల/రేపల్లె: కృష్ణానది నుంచి భారీగా నీరు విడుదల అవుతున్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని దక్షిణ కోస్తా తుఫాన్ ప్రత్యేక అధికారి ఆర్.పి.సిసోడియా అధికారులను ఆదేశించారు. కృష్ణానది వరద ప్రభావం వల్ల ముంపునకు గురయ్యే గ్రామాలలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాల్‌లో ఆయన రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సిసోడియా మాట్లాడుతూ వరద ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ వరద ముంపునకు గురయ్యే రేపల్లె, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్‌గౌడ్, ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ అబూత్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గురువారం పెనుమూడి పుష్కరఘాట్ వద్ద వరద తీవ్రతను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రకాశం బ్యారెజ్ నుంచి రాత్రి ఏడు గంటకు 5.66 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇంకా వరద పెరిగే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంతంలో గజ ఈతగాళ్లతోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
