లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ప్రమాదం లంక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన యంత్రాంగం
భట్టిప్రోలు: మోంథా తుఫాన్ కారణంగా కురిసిన అధిక వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటి విడుదల పెరిగింది. వరద కారణంగా మండలంలోని కృష్ణానది పరివాహక లంక గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వాణిజ్య పంటలు నీట మునిగే ప్రమాదం పొంచి ఉంది. దీంతో రైతులు అప్రమత్తమవుతున్నారు. మండలంలోని ఓలేరు పల్లెపాలెం, పెదలంక కాకుల డొంకలో కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గురువారం నుంచి భట్టిప్రోలు మండలంలోని లంక గ్రామాల్లోని పెదపులివర్రు–పెసర్లంక, ఓలేరు–పెసర్లంక, కోళ్లపాలెం–పెసర్లంక చప్టాల వద్ద నీరు చేరింది. దీంతో ఆయా మార్గాల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామాల వాసులు వెల్లటూరు చినరేవు హై లెవల్ వంతెన మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. వరద నీరు పారుతుండటంతో స్థానికులు రేవులోకి వెళ్లవద్దని తహసీల్దార్ ఆదేశించారు. ఓలేరు పల్లెపాలెం, కాకులడొంక రేవు వద్ద తహసీల్దార్ మేకా శ్రీనివాసరావుతోపాటు ఎస్‌ఐ ఎం. శివయ్య పరిస్థితిని పరిశీలించారు. ఓ పక్క గత రెండు వారాలుగా కురుస్తున్న అధికవర్షాలు, తుపానుకు తోడు వరద చేరడంతో వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భట్టిప్రోలు మండలంలో నదిని ఆనుకుని ఉన్న ఓలేరు పల్లెపాలెం, పెదలంక, పెసర్లంక, చింతమోటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ అన్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బోట్లు, ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కరకట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాలలో మరమ్మతులు నిర్వహించి ఇసుక బస్తాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఆర్‌సీ ఎఈ కె.నాగేశ్వరనాయక్ తమ సిబ్బందితో గండ్లు పడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి పటిష్టం చేయించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
