 
															నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
తుపాను ప్రభావంపై హెచ్చరిక జారీలో ప్రభుత్వం విఫలం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున
రేపల్లె: తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో నేలవాలిన వరి పైరును గురువారం ఆయన పార్టీ నాయకులతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తుపాను హెచ్చరికలు వచ్చిన నాటి నుంచి ప్రజలను, రైతులను అప్రమత్తం చేయటంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. తుపాను ముగిసి రెండు రోజులు గడుస్తున్నా నేటి వరకు పంట నష్టపరిహారాలను అంచనా వేయలేకపోవటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతే గ్రామ సచివాలయ వ్యవస్థతో క్షణాలలో నష్టం గుర్తించి రైతులను ఆదుకున్నట్లు గుర్తుచేశారు. కుల, మత, పార్టీలకు అతీతంగా రైతులను ఆదుకున్నట్లు వెల్లడించారు.
అన్నదాతలపై సీఎం కక్ష
రైతులపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కొంత దెబ్బ తిన్న పంటను లెక్కించ వద్దంటూ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయటమే దీనికి నిదర్శనమన్నారు. ఖరీఫ్ సీజన్ సగం ముగుస్తున్నా ఇప్పటి వరకు రైతులకు ఈ– క్రాప్ బుకింగ్, పంట బీమా చేయించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పెట్టుబడి సాయంగా అందించాల్సిన రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలకు సైతం ప్రభుత్వం గాలికి వదిలేసి రైతులకు నిరాశ మిగిల్చిందన్నారు. మోంథా తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా వ్యాప్తంగా 87 వేల ఎకరాలలో వివిధ రకాల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 26 వేల ఎకరాలకుపైగా వరి పంట దెబ్బతిన్నట్లు చెప్పారు. లంక గ్రామాలలో కంది, పసుపు చేలు, అరటి, బొప్పాయి తోటలు తీవ్రంగా దెబ్బతినటంతో రైతులు కోలుకోని పరిస్థితిలో ఉన్నారన్నారు. నష్టపోయిన రైతులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలలో జరిగిన నష్టాన్ని టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలుసుకున్నారని తెలిపారు. జిల్లాలోని పార్టీ ప్రతినిధులను అప్రమత్తం చేసి రైతులకు అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అన్నదాతలను ఆదుకోవటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ప్రజా, రైతు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఆయన వెంట చెరుకుపల్లి మండల కన్వీనర్ డుండి వెంకట రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిత్రాల ఓబేదు, క్రిస్టియన్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సముద్రాల ప్రభుకిరణ్, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి అహరోన్‌పాల్, పార్టీ నాయకులు, కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
