 
															బర్లీ పొగాకు కొనుగోలుపై మాట తప్పిన ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
మేరుగ నాగార్జున
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రైతులు పండించిన బర్లీ పొగాకును కొంటామని ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కూటమి ప్రభుత్వం మొక్కుబడిగా వ్యవహరించి రైతులను వంచించిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. బుధవారం ఇంకొల్లు మండలం దుద్దుకూరులో ఆయన పర్యటించారు. తుపాను ప్రభావంతో గ్రామంలో నిల్వ ఉంచిన పొగాకు తడిసి పాడైపోతోందని తెలుసుకొని రైతులతో కలిసి పొగాకును పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. వర్షాలు కురుస్తుండడంతో తడిసిన పొగాకు కొద్దిరోజులు గడిస్తే పనికిరాదని రైతులు మేరుగకు వివరించారు. ఒక్క దుద్దుకూరు గ్రామంలోనే 2,700 ఎకరాల్లో పొగాకు సాగు చేసినట్లు రైతులు చెప్పారు. పేరుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం... సరుకు కొనలేదని తెలిపారు. ఇప్పటికీ గ్రామంలో 7,500 క్వింటాళ్ల పొగాకు నిల్వ ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి రైతులపై సవతితల్లి ప్రేమే ఉందన్నారు. సీఎం చంద్రబాబుకు రైతులంటే గిట్టదని పేర్కొన్నారు. తక్షణం ప్రభుత్వం మొత్తం పొగాకును కొని రైతులను ఆదుకోవాలని మేరుగ డిమాండ్ చేశారు. లేదంటే రైతులకు నష్టం పరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు.
ఇద్దరు రైల్వే సిబ్బందిని
కాపాడిన కానిస్టేబుళ్లు
చినగంజాం: మోంథా తుపాను నేపథ్యంలో వరదలో కొట్టుకుపోతున్న ఇద్దరు రైల్వే గ్యాంగ్‌మేన్‌లను పోలీస్ కానిస్టేబుళ్లు కాపాడిన సంఘటన బుధవారం ఉదయం మండలంలో చోటుచేసుకుంది. ఉదయం 7 గంటల సమయంలో ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్ నుంచి డ్యూటీలు ముగించుకొని ద్విచక్రవాహనంపై రైల్వే గ్యాంగ్‌మేన్‌లు గణేష్, బాలాజీరెడ్డి ఇంటికి వెళుతున్నారు. ఉప్పుగుండూరు, నీలాయపాలెం గ్రామాల మధ్య నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లే ప్రయత్నంలో కొట్టుకొని పోయారు. ఆ సమయంలో పక్కనే రైల్వే అండర్ పాస్ దగ్గర డ్యూటీలో ఉన్న చినగంజాం పోలీస్ కానిస్టేబుళ్లు అన్సర్ బాషా, శివశంకర్ రెడ్డిలు రైల్వే సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్నారు. వెంటనే సంఘటన స్థలానికి వచ్చి నీటిలో దూకి కొట్టుకుపోతున్న వారిని కాపాడారు.
నిబంధనల మేరకు పంట నష్ట పరిహారం
కొల్లూరు/వేమూరు: మోంథా తుపాను ధాటికి పంట నష్టం వాటిల్లిన రైతులకు నిబంధనలను అనుసరించి నష్ట పరిహారం అందిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బుధవారం ఆయన వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతో కలసి మండలంలోని రావికంపాడు అడ్డరోడ్డు వద్ద నేలవాలిన వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తుపాను కారణంగా రాష్ట్రంలో తీవ్ర పంట నష్టం వాటిల్లడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. నష్టంపై అంచనాలు రూపొందించి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
రహదారి దుస్థితిపై ప్రజల ఆవేదన
మంత్రి పర్యటన సమాచారం తెలుసుకున్న బొద్దులూరుపాడు, యాదవపాలెం గ్రామాలకు చెందిన ప్రజలు ఆయన వాహన శ్రేణిని ఆపారు. అధ్వానంగా ఉన్న రహదారి గురించి ఆయనకు వివరించారు. వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. అనంతరం కొల్లూరు బాలికోన్నత పాఠశాలలోని పునరావాస కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు.
పునరావాస కేంద్రంలో చీకట్లు
వేమూరు మండలంలోని జంపని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న పోతుమర్రు గ్రామానికి చెందిన బాధితులను అడిగి మంత్రి వసతులు తదితర వివరాలను తెలుసుకున్నారు. విద్యుత్తు సరఫరా, ఫ్యాన్లు లేకపోవడంతో చీకట్లోనే బాధితులు తీవ్ర అవస్థలు పడ్డారు.
 
							బర్లీ పొగాకు కొనుగోలుపై మాట తప్పిన ప్రభుత్వం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
