 
															నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
పర్చూరు(చినగంజాం): తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన ప్రాంతాలను కలెక్టర్ వి. వినోద్ కుమార్ బుధవారం పరిశీలించారు. పర్చూరు వాగు వరద ఉధృతికి పర్చూరు, నాగులపాలెం వరద ముంపుకు గురి అయిన దృష్ట్యా చీరాల, చిలకలూరిపేట హైవేను పర్చూరు వద్ద సుమారు 10 మీటర్లు వెడల్పు మేర రెండు చోట్ల కాలువ తవ్వించి నీటిని దిగువకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. పర్చూరు నుంచి ఉప్పుటూరు వెళ్లే మార్గంలో పర్చూరు వాగు ఉధృతికి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నందున రాకపోకలను నిషేధించాలని సూ చించారు. కారంచేడు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్‌కు, డ్రైనేజీ డీఈకు పలు సూచనలు చేశారు. పర్చూరు మండల ప్రత్యేకాధికారి ఎస్.లవన్న, ఎన్‌హెచ్ డీఈ శ్రీనివాసరావు, చీరాల డ్రైనేజీ డీఓ మల్లికార్జునరావు, పర్చూరు తహసీల్దార్ పి.బ్రహ్మయ్య, కారంచేడు తహసీల్దార్ నాగరాజు, డ్రైనేజీ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. చినగంజాంలో వరదనీరు సముద్రంలో కలిసే ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. రాజుబంగారుపాలెం పంచాయతీ పరిధిలోని అమీన్ నగర్ ప్రాంతంలో పై నుంచి వచ్చే వరద నీరు సముద్రంలోకి పోయే మార్గంలో అవాంతరాలు పరిశీలించారు. సీ మౌత్ మ్యాపు, వరద నీరు పోయే మార్గాన్ని మ్యాపు ద్వారా పరిశీలించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
