 
															వరి పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
భట్టిప్రోలు: భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామ పరిధిలోని వరి పొలాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు బుధవారం పరిశీలించారు. మోంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి పంట రక్షణ, రక్షణకు తక్షణమే చేపట్టాలని చర్యలను శాస్త్రవేత్తలు డాక్టర్ బి.కృష్ణవేణి, డాక్టర్ ఎన్.కామాక్ష్మిలు వివరించారు. పొలంలో నీరు నిల్వ లేకుండా బయటకు పంపించాలని పేర్కొన్నారు. పైరు పడిపోయిన పరిస్ధితుల్లో కట్టలుగా కట్టాలని సూచించారు. ప్రస్తుత పరిస్దితుల్లో వరి పూత దశలో ఉన్నందున పంట పరిస్ధితిని, పురుగు తెగుళ్ల ఉధృతిని బట్టి సస్యరక్షణ చేపట్టాలని వివరించారు. బ్యాక్టీరియా, ఎండాకు తెగులు కనిపిస్తే ప్లాంటో మైసిన్ ఒక మిల్లీ లీటర్, కోసైడ్ కాపర్ హైడ్రాక్సయి 2 గ్రాముల లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. నీరు తగ్గిన తరువాత హెక్సాకోనజోల్ 400 మిల్లీ లీటర్లు పిచికారీ చేసుకోవడం ద్వారా మాని పండు తెగులు వ్యాప్తి తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో రేపల్లె ఏడీఎ ఎ.లక్ష్మి, ఏవో బి.బ్రహ్మారెడ్డి, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
