తుపాను అలర్ట్
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం
సాక్షి ప్రతినిధి,బాపట్ల: తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. సోమవారం నుంచి తుపాను ప్రభావం మొదలయ్యే అవకాశముందని భావిస్తున్న ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఆదివారం జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. మండల అధికారులతోపాటు, ప్రత్యేక అధికారులను మండలాల్లోనే ఉండాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, వైద్యశాఖలతోపాటు ప్రధాన శాఖల అధికారులతో టీములను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బాధ్యతలు అప్పగించారు. తీర ప్రాంతంలోని ప్రతి గ్రామంలోనూ పునరావాస కేంద్రాల కోసం పాఠశాలలు, ఇతర భవనాలను సిద్ధం చేశారు. తుపాను తీవ్రత పెరిగే పక్షంలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం, తాగునీరు, వైద్య సదుపాయం అందించేలా ఏర్పాటు చేశారు.
రేపల్లె డివిజన్‌లో 100 పునరావాస కేంద్రాలు
రేపల్లె డివిజన్‌లో 100 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఆర్డీఓ రామలక్ష్మి తెలిపారు. కొల్లూ రు మండలం 15 లంక గ్రామాల్లోని అన్ని పాఠశాలలను సిద్ధంగా ఉంచగా నిజాంపట్నం మండలం అడవులదీవి, దిండిలతోపాటు పలు ఎస్టీ కాలనీల లో పునరావాసం సిద్ధం చేశారు. రేపల్లె పట్టణంలోని 1, 2, 5, 13, 22, 23, 24 వార్డుల పరిధిలో 5 పాఠశాలలను సిద్ధం చేశారు. తుపాను ప్రభావం అధికంగా ఉండే పక్షంలో స్థానిక పాఠశాలలకు ప్రజలను తరలించి పునరావాసం కల్పించనున్నారు. బాపట్ల, చీరాల నియోజకవర్గాల పరిధిలోని తీరప్రాంతాల తోపాటు అన్ని గ్రామాలలో పాఠశాలలు, ఇతర భవనాలను సిద్ధం చేసి ఉంచారు. అవసరమైతే రెండు నియోజకవర్గాల్లోని తీర గ్రామాల ప్రజలను పునరా వాస కేంద్రాలకు తరలించనున్నారు. వర్షం తీవ్రతను బట్టి వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధం చేసి పెట్టుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు తలెత్తితే ఎన్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు ఇతర రక్షణ టీములను సిద్ధంగా ఉంచారు. ఎక్కడ విపత్తు తెలత్తినా వారు యుద్ధప్రాతిపదికన అక్కడికి చేరేలా ఏర్పాట్లు చేశారు. గ్రామగ్రామాన తుపానుపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో మైకుల్లో చెప్పించడంతోపాటు దండోరా వేయించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లా వ్యాపితంగా అన్ని మండలాల్లో కమాండ్ కంట్రోల్ రూములను ఏర్పాటుచేశారు. చెట్లు కూలినా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా, వైద్య సేవలు అత్యవసరమైనా కమాండ్ కంట్రోల్‌కు తెలియజేయాలన్నారు. భారీ వర్షాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే పక్షంలో విద్యుశాఖ విద్యుత్ పోల్స్, ఇతర సామగ్రితో సిద్ధంగా ఉండి వీలైనంత త్వరగా విద్యుత్‌ను పునరుద్దరించేలా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
పాఠశాలలకు సెలవులు
బాపట్ల, చీరాల ప్రాంతాల్లో
బీచ్‌లు మూత
జిల్లాలో 27 కమాండ్ కంట్రోల్
రూములు
చేపల వేటకు వెళ్లకూడదని
మత్స్యకారులకు హెచ్చరికలు
పునరావాస కేంద్రాలు సిద్ధం
క్షేత్రస్థాయిలో మండల అధికారులు,
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ
అన్ని శాఖల అనుసంధానంతో టీములు
అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షలు


