భక్తులు అప్రమత్తంగా ఉండాలి
బాపట్ల: కార్తిక మాసంలో సముద్రంలో పవిత్ర స్నానం చేయదలచిన వారు అనుకూలమైన వాతావరణ సమయంలో రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగి పొర్లి పారుతున్నాయని గుర్తుచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులు, పంట కాల్వల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో మండల, గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువు గట్లను పటిష్టపరచాలని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. చెరువుల వద్ద పర్యవేక్షణ పెంచాలన్నారు. వేటకు వెళ్లిన జాలర్లను సురక్షితంగా తిరిగి ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మించిన ఇళ్లను త్వరలో ప్రారంభించడానికి సిద్ధం చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్‌ను 08643–220226 ఫోను నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
రామకూరు చెరువు పరిశీలన
జె.పంగులూరు: మండల పరిధిలోని రామకూరు గ్రామానికి చెందిన సింగరు తాగునీటి చెరువును కలెక్టర్ వి. వినోద్ కుమార్ గురువారం పరిశీలించారు. చెరువు కట్టపై ఉన్న పిచ్చి చెట్లను వెంటనే తొలగించాలన్నారు. చెరువుకు ఇంకా నీరు చేరాలని తెలిపారు. మండలంలో ఇతర తాగునీటి చెరువులపై ఆరా తీశారు. ఇ– క్రాప్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామకూరులో వరి పంట గురించి అడిగారు. మండలానికి కలెక్టర్ వచ్చే విషయాన్ని అధికారులు మీడియాకు చెప్పలేదు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి బాలమ్మ, ఆర్‌డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఎంపీడీఓ కె. స్వరూపారాణి, తహసీల్దార్ శ్రీచరణ్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ శ్రీనివాసరావు, మండల అధికారులు పాల్గొన్నారు.


