భారీ వర్షాలకు అస్తవ్యస్తం
● వేమూరు నియోజకవర్గంలో 95 వేల ఎకరాల్లో వరి పంట సాగు కాగా.. 25 వేల ఎకరాల పంట మరో మూడు వారాల్లో కోతకు రానుంది. మిగిలిన 70 వేల ఎకరాలు సుంకు, పొట్ట దశలో ఉంది. కోత దశలో ఉన్న వరిలో.. వేమూరులో 150 ఎకరాలు, కొల్లూరులో వంద ఎకరాలతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 300 ఎకరాల్లో వరి నేల వాలింది. వర్షం కొనసాగే పక్షంలో ఈ పంటతోపాటు సుంకుదశలో ఉన్న వరిపంట చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
● రేపల్లె నియోజకవర్గంలో 28 వేల ఎకరాల్లో వరి సాగు కాగా కొంత పాలు, సుంకుదశలో ఉంది. వానలకు ఇది దెబ్బతినే అవకాశముంది. వర్షం కొనసాగితే మరింతగా నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు.
● బాపట్ల నియోజకవర్గంలో వరిపంట పొట్ట దశలో ఉంది. ఇంతటితో వర్షం ఆగితే ఇబ్బంది ఉండదని రైతులు పేర్కొంటున్నారు.
● పర్చూరు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. పత్తి, సోయాబీన్ , మొక్కజొన్న చేలల్లోకి నీరు చేరింది. మొక్కజొన్న కోత దశలో ఉంది మరింత వర్షం కురిస్తే సోయాబీన్ దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం వల్ల నియోజకవర్గంలోని వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. కొమ్మమూరు కాలువకు నీటి ప్రవాహం పెరిగింది. ఇంకొల్లు మండలం దుద్దుకూరు వద్ద ఎర్రవాగు పొంగి ప్రవహిస్తోంది. ఆలేరువాగు పొంగడంతో తిమిడగపాడు– స్వర్ణ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దన్నపాడు, పొడలవారిపాలెం, కేశవరప్పాడు, పోచినవారిపాలెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. యద్దనపూడి మండలంలో పోలూరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో యద్దనపూడి విజనంపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నీటిప్రవాహం ఉన్న దారుల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు.
● చీరాల నియోజకవర్గంలో భారీ వర్షం కురవడంతో ప్రధానంగా చీరాల పట్టణంలోని దండుబాట పరిధి జాండ్రపేట శివారు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
● అద్దంకి నియోజకవర్గంలో వర్షాలు ఒక మోస్తరుగా కురవడంతో ఉన్న కంది, మినుము పంటలకు నష్టం లేదు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం పాఠశాలలకు సెలవు ఇచ్చారు. పంటనష్టం ప్రాథమిక అంచనాలను శుక్రవారం మధ్యాహ్న సమయానికి అందచేయాలని జిల్లా వ్యవసాయాధికారి సుబ్రమణ్యేశ్వరరావు మండల వ్యవసాయాధికారులను ఆదేశించారు.
వందల ఎకరాల్లో నేల వాలిన వరి చీరాలలో 10. సెం.మీ.వర్షపాతం వేమూరులో 50 వేల ఎకరాల లో దెబ్బతిన్న పంట పర్చూరు నియోజకవర్గంలో పొంగిప్రవహిస్తున్న వాగులు పలు గ్రామాలకు రాకపోకలు బంద్ చీరాల పరిధి లోతట్టు ప్రాంతాలు జలమయంతో ప్రజలకు అవస్థలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుంకు, పాల దశలో ఉన్న వరి పంట దెబ్బతినే అవకాశముంది. ఇప్పటికే వేమూరు నియోజకవర్గంలో కోత దశలోని 300 ఎకరాల వరి పంట నేలకు వాలింది. గురువారం ఉదయానికి జిల్లా వ్యాప్తంగా సగటున 4 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది. చీరాల ప్రాంతంలో అత్యధికంగా 10 సెం.మీ. భారీ వర్షం కురిసింది. పర్చూరు నియోజకవర్గంలోని చినగంజాం మండలంలో 8, వేటపాలెంలో 7, కారంచేడులో 6.5, కొల్లూరులో 5.5, ఇంకొల్లు, నగరం, కొరిశపాడు, అద్దంకి మండలాల్లో 4 నుంచి 5, అమృతలూరు, మార్టూరు, నిజాంపట్నం, రేపల్లె, జె.పంగులూరు, బాపట్ల, యద్దనపూడి, పర్చూరు మండలాల్లో 3 నుంచి 3.5, చుండూరు, భట్టిప్రోలు, సంతమాగులూరు, వేమూరు, బల్లికురవ, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాల్లో 2 నుంచి 3 సెం.మీ. వంతున వర్షపాతం నమోదైంది. చెరకుపల్లి మండలంలో అతి తక్కువగా ఒకటిన్నర సెం.మీ. కురిసింది.
వరి రైతుకు నష్టం
జిల్లాలో 1,03,260 హెక్టార్లలో వరి పంట సాగు అవుతోంది. 2,592 హెక్టార్లలో మొక్కజొన్న, 1821 హెక్టార్లలో మినుము సాగయ్యాయి.
తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధం
చీరాల టౌన్: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. తీరం దాటే వరకు వాడరేవు, సముద్రతీర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణ తెలిపారు. భారీ వర్షాలు, ఈదురు గాలులకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు గుర్తుచేశారు. గురువారం తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది వాడరేవు తీరప్రాంతంలో పర్యటించారు.
1/2
భారీ వర్షాలకు అస్తవ్యస్తం
2/2
భారీ వర్షాలకు అస్తవ్యస్తం