
రైలు ఎక్కితే రక్షణ కరువు
సిబ్బంది కొరత ప్రధాన సమస్య
దాచేపల్లి : రైలు ప్రయాణికులకు భద్రత కరువైంది. ఇటీవల జరిగిన వరుస ఘటనలతో గుండెళ్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఇటీవల ప్రయాణికుల నుంచి దుండగులు బంగారం, నగదు దోచుకున్న ఘటనలు భారీగా జరిగాయి. తాజాగా సంత్రగాచి స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం తీవ్ర సంచలనంగా మారింది. రైలు ప్రయాణికుల్ని కలవరపాటుకు గురి చేసింది.
కత్తితో బెదిరించి అత్యాచారం
ఏపీకి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు(35) సోమవారం రాజమహేంద్రవరం స్టేషన్‌లో చర్లపల్లి వెళ్లేందుకు సంత్రగాచి ప్రత్యేక రైలు ఎక్కింది. ఆమె అక్కడ ఇళ్లల్లో పని చేసుకుని జీవించేందుకు వెళుతోంది. రైలు గుంటూరు స్టేషన్‌కి చేరుకున్న తరువాత మహిళా బోగీలో ఉన్న ప్రయాణికులంతా దిగి పోయారు. ఆమె ఒక్కతే మిగిలింది. బోగీలోని 40 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి ఎక్కేందుకు ప్రయత్నించగా ఆమె ఒప్పుకోలేదు. బలవంతంగా ఎక్కాడు. గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన 20 నిమిషాల తరువాత బోగీ తలుపులు మూసివేశారు. ఒంటరిగా ఉన్న మహిళ ప్రయాణికురాలిని కత్తితో బెదిరించి, బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్ద ఉన్న రూ. 5,600తో పాటు సెల్‌ఫోన్, హ్యాండ్‌బ్యాగ్ లాక్కొని దాడి చేసి, పెదకూరపాడు చేరుతుండగా కిందకు దిగి పారిపోయాడు. రైలు మంగళవారం చర్లపల్లి స్టేషన్‌కు చేరుకున్న తరువాత బాధితురాలు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తర్వాత నడికుడి జీఆర్పీ పోలీసులకు బదిలీ చేశారు.
బెంబేలెత్తుతున్న ప్రయాణికులు
ఇటీవల నడికుడి, తుమ్మలచెరువు, పిడుగురాళ్ల, బెల్లంకొండ స్టేషన్ల పరిధిలో రైళ్లల్లో ప్రయాణికులను బెదిరించి బంగారం, నగదును దుండగులు దోచుకున్నారు. ఆగంతకులు రైళ్లను ఆపి పారిపోవడం ఆ శాఖకు సవాల్‌గా మారింది.
ప్రయాణికుల గుండెల్లో రైళ్లు
పెరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు
తాజాగా ప్రయాణికురాలిపై
దుండగుడి లైంగికదాడి
సికింద్రాబాద్‌లో కేసు నమోదు..
నడికుడికి బదిలీ
జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ల్లో సిబ్బంది కొరత
రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటైన జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ల్లో సిబ్బంది కొరతతో ప్రయాణికులకు సరియైన భద్రత కల్పించటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు రైల్వే డివిజన్‌లో రెండో అతి పెద్ద స్టేషన్ అయిన నడికుడి రైల్వే జంక్షన్‌లో ఉన్న ఆర్పీఎఫ్ కార్యాలయాన్ని పిడుగురాళ్లకు తరలించారు. నడికుడి స్టేషన్‌లోని జీఆర్పీ కార్యాలయంలో ఎస్‌ఐగా నరసరావుపేట స్టేషన్‌లో పని చేస్తున్న అధికారి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. స్టేషన్లలో, రైళ్లలో సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల దుండగులు యథేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్నారు.