
బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి
కారంచేడు: దీపావళి సమీపిస్తున్న తరుణంలో చీరాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న బాణసంచా గోదాముల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని, దుకాణాలకు అనుమతులు తీసుకోవాలని చీరాల డీఎస్పీ మహ్మద్ మొయిన్, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్‌నాయుడు స్పష్టం చేశారు. గురువారం మండలంలోని స్వర్ణ, కారంచేడుతోపాటు చీరాల, వేటపాలెం మండలాల్లో కూడా బాణసంచా గోదాములను వారు తనిఖీ చేశారు. నిబంధనల మేరకు నిల్వ చేయాలన్నారు. తగిన జాగ్రత్తలను పాటించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి హాని జరగని విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధరల విషయంలో పట్టికలు వినియోగదారులకు అందుబాటులో ఉంచాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నష్టం కలిగించని విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కారంచేడు తహసీల్దారు జి.నాగరాజు, చీరాల ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ, కారంచేడు ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషా, మండల రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, గోదాముల నిర్వాహకులు పాల్గొన్నారు.