
ఇంటికి చేరేలోపే మృత్యువాత
ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి
బల్లికురవ: పింగాణీ పరిశ్రమలో పనిచేస్తూ డ్యూటీ ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తున్న యువకుడిని, సుబాబుల్ కర్ర లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చెన్నుపల్లి–అనంతవరం ఆర్‌అండ్‌బీ రోడ్డులోని వేమవరం గ్రామంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. బల్లికురవ పంచాయతీలోని కొండాయపాలెం గ్రామానికి చెందిన పూరిమెట్ల శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పెద్ద కుమారుడు వెంకటేష్ బార్బర్ షాప్ నిర్వహిస్తూ జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. రెండో కుమారుడు గోపికష్ణ (30) ఎంబీఏ వరకు చదువుకున్నాడు. వేమవరం గ్రామ సమీపంలోని పింగాణీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగిసిన తదుపరి ఇంటికి వెళుతుండగా వేమవరం నుంచి చిలకలూరిపేట వైపు సుబాబుల్ కర్ర లోడుతో వెళుతున్న ట్రాక్టర్ డోర్లు విడిచి వస్తోంది. అది అకస్మాత్తుగా ఢీకొట్టడంతో మార్జిన్ అర్థం కాక గోపికృష్ణ బైక్ పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జున్జుయింది. అరగంటలో ఇంటికి చేరేలోపే ఈ ప్రమాదం సంభవించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతునికి నాలుగు సంవత్సరాల కిందట అమూల్య కుమారితో వివాహమైంది. మూడు సంవత్సరాల బాబు ఉండగా.. ప్రస్తుతం అమూల్య నిండు గర్భిణి. బుధవారం మృతుడి తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు బల్లికురవ ఎస్సై వై. నాగరాజు కేసు నమోదుతో పోస్టుమార్టం నిమిత్తం భౌతికకాయాన్ని మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొండాయపాలెం, చెన్నుపల్లి గ్రామాల్లో అందరితో కలివిడిగా ఉండే శ్రీనివాసరావు కుమారుడు రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందటంతో రెండు గ్రామాల్లోని ప్రజలు కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఇంటికి చేరేలోపే మృత్యువాత