
మహిళలపై మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులు అరికట్టాలి
ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి
రేపల్లె: మహిళలపై వేధింపులకు పాల్పడే మైక్రో ఫైనాన్స్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని, డ్వాక్రా మహిళల వద్ద అక్రమ వసూళ్లూ, అవినీతిని అరికట్టాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి డిమాండ్ చేశారు. పట్టణంలోని జగనన్న కాలనీలో అధిక వడ్డీలు, అక్రమ వసూళ్లు అనే అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. పిల్లల చదువులు, ఆరోగ్యాల కోసం తప్పని పరిస్థితుల్లో అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారన్నారు. ప్రభుత్వ బ్యాంకులు, డ్వాక్రాలో ఉన్న మహిళలకు కూడా సక్రమంగా ప్రభుత్వం రుణాలు మంజూరు చేయకపోవటంతో ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ కంపెనీలను ఆశ్రయిస్తున్నారన్నారు. ఫైనాన్స్ సంస్థలు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి మహిళలను మానసికంగా, ఆర్థికంగా హింసిస్తున్నారని అన్నారు. డ్వాక్రాలో కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు పలుచోట్ల అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ డ్వాక్రా గ్రూపు సభ్యులను లంచాల కోసం వేధిస్తున్నారన్నారు. ప్రతిచోట డ్వాక్రాలో అవినీతి రాజ్యమేలుతున్నా ఉన్నతాధికారులు పట్టీపట్లనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అన్ని అర్హతలు ఉన్న గ్రూపులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించకుండా ఆర్‌పీలు లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. రుణాల కోసం ఆర్‌పీలకు లంచాలు చెల్లించి నెలవారి కిస్తీలు కట్టలేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అంశాలను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించామని అవగాహన సదస్సులు నిర్వహిస్తూ మహిళలను చైతన్యపరుస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. మైక్రోఫైనాన్స్ సంస్థల ఆగడాలు అరికట్టటంతో పాటు డ్వాక్రాలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పలు అంశాలపై మాట్లాడారు. సదస్సులో సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు సీహెచ్.మణిలాల్, ఐద్వా పట్టణ కార్యదర్శి నాంచారమ్మ, నాయకులు వి.ధనమ్మ, సభ్యులు ఎస్‌కే.ఫర్జానా, స్వావమ్మ, వనజాక్షి, లక్ష్మణరావు, డి.అగస్టీన్ తదితరులు పాల్గొన్నారు.