
బావమరిది దాడిలో బావ మృతి
చేబ్రోలు: అక్కాబావల మధ్య జరుగుతున్న వివాద విషయం తెలుసుకున్న బావమరిది అక్కడకు వెళ్లి బావతో గొడవ పడి క్షణికావేశంలో కర్రతో తలపై దాడి చేసి గాయపరచటంతో మరణించిన సంఘటన చేబ్రోలు మండలం గుండవరం గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండవరం గ్రామానికి చెందిన నన్నపనేని కృష్ణబాబు (35)కు అదే గ్రామానికి చెందిన మక్కే భువనేశ్వరితో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వారం రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా గొడవ పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో కృష్ణబాబు, భువనేశ్వరిల మధ్య వివాదం జరుగుతుండటంతో భువనేశ్వరి తమ్ముడు గోపీకి ఫోన్ చేసి గొడవ జరుగుతున్న విషయాన్ని తెలియజేసింది. గోపి అక్కాబావల ఇంటికి వచ్చి గొడవ విషయం గురించి మాట్లాడుతుండగా బావ బావమరిదిల మధ్య మాటమాట పెరిగింది. క్షణికావేశంలో గోపి బావను సమీపంలో ఉన్న పెద్ద కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలై పడిపోయాడు. బంధువులు తీవ్ర గాయాలైన కృష్ణబాబును వడ్లమూడిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతుని తల్లి నన్నపనేని వీరకుమారి ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్‌ఐ డి వెంకటకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.