
హాస్టళ్లలో వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
రేపల్లె: హాస్టళ్లలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందని ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి ఎం.సూర్యప్రకాశ్ విమర్శించారు. పట్టణంలోని అంబేడ్కర్ బాలికల గురుకుల వసతి గృహాన్ని శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ బృందం పరిశీలించింది. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. సూర్యప్రకాశ్ మాట్లాడుతూ హాస్టల్‌లో పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 618 మంది విద్యార్థినులు ఉన్న గురుకులంలో ఆర్వో ప్లాంట్ పనిచేయక తాగునీటి కోసం అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పారు. మోటర్ పనిచేయక పోవడంతో స్నానాలు, ఇతర అవసరాలకు కింద నుంచి మూడవ అంతస్తు వరకు నీటిని మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. ఫిబ్రవరిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయులు వసతి గృహాన్ని సందర్శించిన సమయంలో ఆయా సమస్యలను విద్యార్థినులు ఆయనకు వివరించారని గుర్తు చేశారు. వారం రోజుల్లో ఆర్వో ప్లాంట్ బాగు చేయిస్తామని, నిధులు వెంటనే కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించి నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడం సిగ్గుచేటని ఖండించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థినుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కేవీ లక్ష్మణరావు, బాలికల విభాగం కన్వీనర్ కె.భవాని, పి.నిఖిత, వై.నవీన్ పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి సూర్యప్రకాశ్