
దొంగల బీభత్సం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉండవల్లి అమరావతి రోడ్డులో సాయిబాబా గుడి వద్ద శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు చోరులు బీభత్సం సృష్టించారు. ఉండవల్లి రోడ్డులో తిరుగుతూ పలుచోట్ల సీసీ కెమెరాల వైర్లు ధ్వంసం చేశారు. ఎలక్రిక్టల్ షాపులో చోరీ చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. రాధాకృష్ణ హార్డ్‌వేర్ అండ్ ఎలక్ట్రికల్ షాపు యజమాని శనివారం రాత్రి 10 గంటల సమయంలో షాపు మూసి ఇంటికి వెళ్లారు. అనంతరం 12.10 నిమిషాలకు ముగ్గురు వ్యక్తులు మాస్క్‌లు ధరించి హార్డ్‌వేర్ షాపు చుట్టుపక్కల సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి, కెమెరాలను ధ్వంసం చేశారు. 1.45 గంటలకు షాపు రేకులపై నుంచి వెనుకవైపు ఉన్న చిన్న సందులోకి దిగారు. పలుగుతో వెనుక తలుపు పగలుగొట్టి లోపలకు దూరారు. 2.45 గంటల వరకు షాపులో ఉండి వస్తువులను మూటలు కట్టుకుని గోడ అవతల విసిరివేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మాస్క్‌లు ధరించడంతో గుర్తించడం కష్టంగా మారింది. షాపు యజమాని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో గుంటూరు నుంచి వేలిముద్రల నిపుణులు వచ్చి పరిశీలించారు. షాపులో సుమారు రూ.3 లక్షల విలువైన సరుకు, రూ.50 వేలు చోరీ అయినట్లు యజమాని తెలిపారు.
పలుచోట్ల సీసీ కెమెరాలు ధ్వంసం
రూ.3 లక్షల సామగ్రి దొంగతనం

దొంగల బీభత్సం