
బాబుకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య
ఇంకొల్లు(చినగంజాం): చంద్రబాబుకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని, ఆయన చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకెళ్దాం అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. పర్చూరు నియోజకవర్గ స్థాయి ‘బాబు షూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా క్యాడర్ సమాయత్త సభ ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి అధ్యక్షత వహించారు. నాగార్జున మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ’ అనే కార్యక్రమం ద్వారా చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలను ఏడాదిన్నర కావస్తున్నా అమలు చేయకపోగా ప్రజలను మోసం చేసే విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి అని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం విషయంలో ఆయన గొప్ప ఆవిష్కరణలు చేపట్టి, కులం, మతం, పార్టీ అని చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప వ్యక్తి జగన్‌మోహనరెడ్డి అని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏవిధంగా ప్రజలను మోసం చేసిందో అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ వైఎస్ కూటమి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని అన్నారు. పొగాకు కంపెనీలకు, పార్టీ నాయకులకు మేలు చేసేందుకే బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కూటమి ప్రభుత్వ తీరు కన్పిస్తుందని విమర్శించారు. పొగాకు, మిర్చి, కంది, శనగ, మినుములు, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ పర్చూరు ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మేనిఫెస్టోలో చూపించిన కార్యక్రమాలు అమలు చేయలేదనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని, క్యూఆర్ కోడ్‌ను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, పర్చూరు పంచాయతీరాజ్ అధ్యక్షుడు ఆసోది బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషా వలి, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్, పార్టీ మండల కన్వీనర్‌లు జంపని వీరయ్యచౌదరి, కఠారి అప్పారావు, మున్నం నాగేశ్వరరెడ్డి, చిన్ని పూర్ణారావు, ఉప్పలపాటి చెంగలయ్య, పావులూరు సర్పంచ్ బొల్లెద్దు లుధియమ్మ, సీనియర్ నాయకులు భవనం శ్రీనివాసరెడ్డి, కొల్లా వెంకటరావు, గడ్డం మస్తాన్‌వలి, బిల్లాలి డేవిడ్, దాసరి వెంకట్రావు, యూ అనిల్, కుమ్మరి చందు, కాటి లక్ష్మణ్, పాలేరు వీరయ్య, ఎంపీపీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

బాబుకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య